FPIs: భారత ఈక్విటీల్లో కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు

by S Gopi |   ( Updated:2025-03-09 16:15:15.0  )
FPIs: భారత ఈక్విటీల్లో కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్చి నెలలో మొదటి వారం రోజుల్లోనే ఏకంగా రూ. 24,753 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు, దేశీయంగా త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు బలహీన ఆదాయాలను ప్రకటించడం వంటి అంశాలు అమ్మకాలకు దారితీశాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, అంతకుముందు ఫిబ్రవరిలో మన మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 34,574 కోట్లను, జనవరిలో రూ. 78,027 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో 2025లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 1.37 లక్షల కోట్ల నిధులు విదేశాలకు తరలిపోయాయి. మార్చి నెలలోనూ ఎఫ్‌పీఐల ఉపసంహరణ కొనసాగడంతో వరుసగా 13వ వారం విదేశీ నిధుల తరలింపు నమోదైందని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్ 13 నుంచి ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 1.49 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు ఈ అమ్మకాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా లాంటి దేశాలపై అధిక టారిఫ్‌లను ప్రతిపాదించడం, భారత్‌పైనా సుంకాలను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేయడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. దీనికి పేలవమైన త్రైమాసిక ఫలితాలు, భారత రూపాయి బలహీనత తోడయ్యాయి.

Read Also..

BOB: మహిళా ఎన్నారైల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన బీఓబీ

Next Story