ఈవీల వాడకం పెరగడం ద్వారా చైనాపై ఆధారపడాల్సి వస్తుంది: జీటీఆర్ఐ!

by Harish |
ఈవీల వాడకం పెరగడం ద్వారా చైనాపై ఆధారపడాల్సి వస్తుంది: జీటీఆర్ఐ!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ మద్దతుతో పాటు ప్రజలు సైతం పర్యావరణహితమైన వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీ పెరుగుతున్న కొద్దీ చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుందని ప్రముఖ ఎకనామిక్ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) వెల్లడించింది.

ముఖ్యంగా భారత్ ముడి సరుకులతో పాటు బ్యాటరీ, మినరల్స్ ప్రాసెసింగ్ కోసం చైనాపై ఆధార పడాల్సి ఉంటుందని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. అంతేకాకుండా ఈవీల వల్ల బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్ పెరగడంతో కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఉత్పత్తి అవుతున్న లిథియంలో 60 శాతం చైనాలోనే ప్రాసెస్ అవుతోంది. ఇది కాకుండా 65 శాతం కోబాల్ట్, 93 శాతం మాంగనీస్‌లను ఆ దేశం ప్రాసెస్ చేస్తోంది.

లిథియం అయాన్ సెల్స్‌లో వాడే కేథోడ్, యానోడ్స్లను చైనాకు చెందిన కంపెనీలు తయారు చేస్తాయి. ఈ క్రమంలో దేశీయంగా ఈవీల ఉత్పత్తి ఊపందుకుంటే ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఈవీల వల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై ప్రభావం ఉంటుందని, దిగుమతులు, విద్యుత్ వినియోగం పెరగడం, ప్రభుత్వ రవాణా నెమ్మదించడం, లిథియం లభ్యత వంటి అంశాల్లో సవాళ్లను పరిష్కరించే చర్యలు ఉండాలని జీటీఆర్ఐ సహ-వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

ముఖ్యంగా ఈవీల్లో వాడే లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్ వంటి ఖనిజాల వాడకం వల్ల వాటి వెలికితీత, ప్రాసెస్, రవాణా, నీటి కాలుష్యం వంటి అంశాలను మరువకూడదని అజయ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story