Dhanteras: ధనత్రయోదశికి రూ. 60,000 కోట్ల అమ్మకాలు

by S Gopi |
Dhanteras: ధనత్రయోదశికి రూ. 60,000 కోట్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ధనత్రయోదశి అన్ని వ్యాపారాలకు బాగా కలిసొచ్చింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వ్యాపారులు చాలా ముందుగానే సన్నాహాలు చేసుకోవడంతో భారత రిటైల్ రంగం గణనీయమైన అమ్మకాల బూమ్‌ను చూసిందని పరిశ్రమ సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ధనత్రయోదశి(ధన్‌తేరాస్) సందర్భంగా దేశీయ వ్యాపారులు సుమారు రూ. 60,000 కోట్ల వ్యాపారాలను చేయవచ్చని అంచనా వేసింది. కేంద్రం 'వోకల్ ఫర్ లోకల్ ' నినాదాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారని, చాలా వరకు కొనుగోళ్లలో స్థానిక తయారీ ఉత్పత్తులకే ప్రాధాన్యత కనిపిస్తోందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దీనివల్ల దీపావళి సందర్భంగా జరిగే అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల ప్రభావం తగ్గి చైనాకు రూ. 1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

సాంప్రదాయకంగా ధనత్రయోదశికి గణేషుడు, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తారు. అందరి శ్రేయస్సును ఆశిస్తూ కొత్త వస్తువులను, విలువైన వాటిని కొనుగోలు చేస్తారు. వాటిలో బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వ్యాపార పరికరాలు, గృహోపకరణాలు ఉంటాయి. మంగళవారం(అక్టోబర్ 29) ఒక్కరోజే బంగారం అమ్మకాలు రూ. 20,000 కోట్లకు చేరాయని, వెండి అమ్మకాలు రూ. 2,500 కోట్లు ఉంటాయని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్(ఏఐజేజీఎఫ్) జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా చెప్పారు. దేశవ్యాప్తంగా 25 టన్నుల బంగారం, 250 టన్నుల వెండి విక్రయాలు జరిగాయి. మరోవైపు పాత వెండి నాణెలు డిమాండ్ కారణంగా ఒక్కో నాణెం రూ. 1,200 నుంచి రూ. 1,300 పలికాయి.

Advertisement

Next Story