తగ్గని నగదు వాడకం.. పెరిగిన ఏటీఎం విత్‌డ్రాలు

by S Gopi |
తగ్గని నగదు వాడకం.. పెరిగిన ఏటీఎం విత్‌డ్రాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. యూపీఐ సేవలు దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరాయి. చిన్న చిన్న దుకాణాల్లోనూ ఆన్‌లైన్ చెల్లింపులు సులభంగా జరుగుతున్నాయి. అయితే, యూపీఐ సేవలు ఎంత పెరుగుతున్నప్పటికీ ఇంకా నగదు వాడకమే రారాజుగా కొనసాగుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలో రూ. 13.35 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 35 లక్షల కోట్లకు చేరింది. దేశంలోని ఏటీఎంలలో నగదు నిర్వహణ బాధ్యతను చూస్తున్న సీఎంఎస్ కంపెనీ కన్సప్షన్ రిపోర్ట్ ప్రకారం, గతేడాదిలో నెలకు సగటున ఏటీఎం విత్‌డ్రా మొత్తం 5.51 శాతం పెరిగింది. 2022-23లో సగటున రూ. 1.35 కోట్లుగా ఉన్న విత్‌డ్రా 2023-24లో రూ. 1.43 కోట్లకు పెరిగింది. ప్రజలు ఇప్పటికీ ఏదైనా కొనాలంటే నగదు ఎక్కువగా వాడుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. పైగా వ్యవస్థలో నగదు వినియోగం పెరిగిన ధోరణి కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. మెట్రో నగరాల్లో ఏటీఎం విత్‌డ్రాలు 10.37 శాతం పెరిగాయని, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.94 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది. ఏటీఎం విత్‌డ్రాలకు సంబంధించి అత్యధికంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లలో జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో 49 శాతం మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో జరుగుతుండగా, 51 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగ ఏటీఎంలలో 64 శాతం మెట్రో, అర్బన్‌లలో, 36 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో విత్‌డ్రాలు నమోదయ్యాయి.

Advertisement

Next Story