Apple: చైనాలో తగ్గిన ఐఫోన్ అమ్మకాలు.. టాప్ 5 నుంచి ఔట్

by Harish |
Apple: చైనాలో తగ్గిన ఐఫోన్ అమ్మకాలు.. టాప్ 5 నుంచి ఔట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ అమ్మకాలు చైనాలో క్రమంగా తగ్గుతున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నుండి డేటా ప్రకారం, చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్రమైన పోటీ కారణంగా నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా యాపిల్ మొదటి ఐదు ర్యాంకుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అక్కడి స్థానిక కంపెనీల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఐఫోన్ విక్రయాలు గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం చైనా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు సంవత్సరానికి 8.9 శాతం పెరిగి 71.6 మిలియన్ యూనిట్లకు చేరుకోగా, వీటిలో vivo, Huawei, Xiaomi వంటి కంపెనీల వాటా ఎక్కువగా ఉంది. Huawei, Xiaomi పుంజుకోవడంతో యాపిల్‌కు తీవ్ర దెబ్బ తగిలింది.

చైనా ప్రభుత్వ డేటా ప్రకారం, ఏప్రిల్, మేలో యాపిల్ షిప్‌మెంట్‌లలో 40 శాతం పైగా పెరుగుదల ఉండగా, స్థానిక కంపెనీలకు ఆదరణ పెరగడంతో గత నెలలో ఐఫోన్ విక్రయాలు పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కెనాలిస్ చైనా ఐఫోన్ షిప్‌మెంట్‌లలో 3.9 శాతం తగ్గుదలని నివేదించింది, అలాగే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కూడా 5.7 శాతం తగ్గుదలని పేర్కొంది.

చైనా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ప్రస్తుతం vivo కంపెనీ అగ్రస్థానంలో ఉంది. గత త్రైమాసికంలో ఐదవ స్థానం నుండి ఇది గణనీయంగా పెరిగింది. మరోవైపు చైనాలో అమ్మకాలను పెంచుకోవడానికి యాపిల్ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇటీవల మార్చిలో, కంపెనీ షాంఘైలో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది, దీనిని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. అమెరికా వెలుపల యాపిల్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌ కాగా ఇప్పుడు అక్కడ తక్కువ అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం.



Next Story