మళ్లీ లేఆఫ్స్ ప్రకటించిన అమెజాన్

by S Gopi |
మళ్లీ లేఆఫ్స్ ప్రకటించిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది భారీ లేఆఫ్స్‌తో ఉద్యోగులకు మొండిచేయి చూపిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2024లోనూ అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఏడాది ప్రారంభంలోనే వందలాది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం పలు కథనాల ప్రకారం, అమెజాన్ సంస్థ తన ఎంజీఎం స్టూడియోతో సహా దాని స్ట్రీమింగ్, స్టూడియో విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. అంతకుముందు మంగళవారమే కంపెనీ తన లైవ్ స్ట్రీమ్ సేవలందించే ట్విచ్‌లో 500 మంది వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తాజా తొలగింపులు అంతర్జాతీయంగా ఉంటాయని, ప్రస్తుతానికి అమెరికాలో ప్రభావితమైన ఉద్యోగుల వివరాలను వెల్లడించగా, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వివరాల గురించి వారం చివరిలో తెలియజేయనున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తన నోట్‌లో, కంపెనీ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెట్టుబడులను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కంటెంట్ విభాగాలపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story