Budget 2024: మూలధన వ్యయానికి రూ.11.11 లక్షల కోట్లు

by Harish |
Budget 2024: మూలధన వ్యయానికి రూ.11.11 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా దేశంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో 2024-25 సంవత్సరానికి మూలధన వ్యయం కోసం ప్రభుత్వం రూ. 11.11 లక్షల కోట్లను ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. ఈ ఏడాది కోసం మొత్తం రూ.11,11,111 కోట్లు కేటాయించగా, ఇది దేశ జీడీపీలో 3.4 శాతానికి సమానం. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతును అందించడానికి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనిని ప్రారంభించడం ద్వారా మౌలిక సదుపాయాలలో ప్రైవేటు పెట్టుబడులకు మరింత అవకాశం కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. దీంతో పాటు, రాష్ట్రాలకు తమ అభివృద్ధి ప్రాధాన్యతలకు లోబడి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోటానికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహాం అందిస్తామని, దీని కోసం కేంద్రం తరఫున రూ.1.5 లక్షల కోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాన్ని రాష్ట్రాలకు అందిస్తామని ఆమె చెప్పారు.

పెరుగుతున్న కేటాయింపులు

మూలధన వ్యయాన్ని ప్రభుత్వం ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.4.39 లక్షల కోట్లుగా కాగా, ఇది తర్వాతి ఏడాది 2021-22 లో రూ.5.54 లక్షల కోట్లకు పెరిగింది. మళ్లీ 2022-23 లో ఏకంగా 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంది. తర్వాత 2023-24లో రూ.10 లక్షల కోట్లకు చేరగా, ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ రూ.11.11 లక్షల కోట్లను కేటాయించింది.

Advertisement

Next Story

Most Viewed