- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gautam Adani: అమెరికాలో పెట్టుబడి ప్రణాళికలను పునరుద్ధరించనున్న అదానీ గ్రూప్

దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి భారత్‌లో ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అదానీ గ్రూప్ ప్రాజెక్టులపై దీని ప్రభావం ఉంటుందని అంతా భావించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత గౌతమ్ అదానీపై వచ్చిన అభియోగాలకు సంబంధించి చట్టాన్ని నిలుపుదల చేస్తూ సంతకం చేశారు. తాజాగా అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడుల కోసం అవసరమైన ప్రణాళికలను పునరుద్ధరిస్తున్నట్టు సమాచారం. ఆ దేశంలోని న్యూక్లియర్ ఎనర్జీ, తూర్పు తీరంలోని ఓడరేవులో ప్రాజెక్టులను అన్వేషిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడంతో అదనీ ప్రాజెక్టుల ప్రణాళికలు తిరిగి మొదలవనున్నట్టు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, లంచం ఆరోపణల వ్యవహారంలో న్యాయ పోరాటాన్ని ఎదుర్కొంటూనే పెట్టుబడుల ప్రణాళికలు కొనసాగిస్తారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. అయితే, అదానీ గ్రూప్‌నకు ఇప్పటికీ అమెరికాలో ప్రతికూలతలు ఉన్నాయి. టెక్సాస్‌లో పెట్రోకెమికల్ ప్రాజెక్టుల విషయమై అక్కడి కంపెనీలతో జరిపిన చర్చలు ఒప్పందాల వరకు వెళ్లలేదు. గౌతమ్ అదానీపై అభియోగాలను కొట్టివేస్తే అమెరికా తన కంపెనీ పెట్టుబడులను మరింత వేగవంతంగా కొనసాగించవచ్చని వాషింగ్టన్‌కు చెందిన నిపుణులు మైఖేల్ కుగెల్‌మన్ పేర్కొన్నారు.