అనుమతులు రాక జనం బాధలు.. నిలువునా దోస్తున్న కార్పొరేటర్లు

by Sridhar Babu |   ( Updated:2021-12-15 01:52:26.0  )
House-Build-bribe1
X

ఇంటి నిర్మాణం ఎంత చిన్నదైనా.. పెద్దదైనా… అధికారుల అనుమ‌తి ఉన్నా.. లేకున్నా… స్థానిక కార్పొరేట‌ర్ల దీవెన ఉంటే త‌ప్పా ఇంటి నిర్మాణం పూర్తయ్యే అవ‌కాశ‌మే లేదు. మున్సిప‌ల్ నిబంధ‌న‌ల ప్రకారం ఇంటి నిర్మాణానికి ముందే జీహెచ్ఎంసీలో అనుమ‌తుల కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనుమ‌తులు ల‌భించిన త‌ర్వాత మాత్రమే నిర్మాణ ప‌నులు మొద‌లు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంటి నిర్మాణం కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొని నెల‌లు గ‌డుస్తున్నా అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌డంతో చేసేదేమీలేక స్థానిక కార్పొరేట‌ర్‌ల‌ను ఆశ్రయిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే ఆ అనుమ‌తులు రాక‌పోవ‌డానికి అస‌లు సూత్రదారులు కార్పొరేట‌ర్లే. ఈ కార్పొరేట‌ర్లు అధికారుల‌తో కుమ్మకై ఇంటి నిర్మాణ అనుమ‌తులు రాకుండా అడ్డుకుని తిరిగి స్థానిక కార్పొరేట‌ర్లను ఆశ్రయించేలా చేయ‌డ‌మే అస‌లు రహస్యం. ఇక ఇంటి నిర్మాణం ఎలా చేయాలి అని వ‌చ్చిన య‌జ‌మానికి కార్పొరేటర్ ఇలా గీతోప‌దేశం చేస్తాడు. మీరు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలంటే పెద్ద త‌తంగం ఉంటుంది. కానీ సంబంధిత అధికారి మ‌న‌వాడే. నేను చెప్తే వింటాడు. కానీ… కొంత ఖ‌ర్చవుతుంది. ఓకే అంటే మీరు రేపే ప‌ని మొద‌లు పెట్టవ‌చ్చు. అని త‌న మ‌న‌సులోని మాట‌ను వెళ్లగ‌క్కుతాడు. అర్థం చేసుకున్న బాధితుడు ఎంత అవుతుంది అన్న ప్రశ్నకు స‌మాధానంగా అంత‌స్తుకు ఇంత‌ని చెప్పి ఈ వ్యవ‌హారాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా ముగిస్తాడు.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో న‌గ‌ర శివారు ప్రాంతాలు కూడా అంతే వేగంతో విస్తరిస్తున్నాయి. న‌గ‌రంలో ఇంటిని కొనుగోలు చేసే శ‌క్తి లేని చాలా మంది శివారు ప్రాంతాల‌లో ప్లాట్లను కొనుగోలు చేసి త‌మ సొంతింటి క‌లను సాకారం చేసుకోవ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. ఎల్బీన‌గ‌ర్ జోన్ ప‌రిధిలో ఇంటి నిర్మాణం చేప‌ట్టాలంటే జీహెచ్ఎంసీ అధికారుల అనుమ‌తులు త‌ప్పనిస‌రి. ఈ నిబంధ‌నే జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లకు వ‌రంగా మారింది.

అధికారుల ప‌ని తీరు అంతంత మాత్రమే..

ఇంటి నిర్మాణ అనుమ‌తుల కోసం నెల‌ల త‌ర‌బ‌డి ఎదురు చూసినా అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. సామాన్యులు చెప్పుల‌రిగేలా తిరిగినా ప‌ట్టించుకోని వీరు ప్రజా ప్రతినిధుల ఫోన్ కాల్ కి మాత్రం త‌క్షణ‌మే స్పందిస్తున్నారు. అనుమ‌తులు లేని నిర్మాణాల‌పై ఈ మ‌ధ్యకాలంలో జిల్లా క‌లెక్టర్ సీరియ‌స్ అవ‌డంతో సంబంధిత అధికారులు జెడ్ స్పీడ్‌లో భ‌వ‌నాలు కూల్చుతాం అంటూ బ‌య‌లుదేరారు. కొన్ని భ‌వ‌నాల‌కు రంధ్రాలు చేసి మ‌రికొన్ని భ‌వ‌నాల‌కు హెచ్చరిక‌ల బోర్డులు త‌గిలించి మ‌మా.. అనిపించారు. ఒక ఇంటి నిర్మాణానికి నాలుగు నెల‌ల నుండి ఏడాది కాలం ప‌డుతుంది. కానీ భ‌వ‌నం పూర్తి నిర్మాణం అయ్యేంత వ‌ర‌కు అధికారులు చూడ‌లేదా.. స్థానిక ప్రజా ప్రతినిధుల మాట కాద‌న‌లేక వ‌దిలేశారా… అంటూ ప‌లువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాలు అన్నీ కార్పొరేట‌ర్లు, స్థానిక ప్రజా ప్రతినిధుల క‌నుస‌న్నల్లోనే జ‌రుగుతున్నాయ‌న్న వాస్తవం ప్రజ‌ల‌కు తెలియందికాదు. కొంత మంది కార్పొరేట‌ర్లు ఓటు వేసి గెలిపించిన ప్రజ‌ల కోసం నిబ‌ద్ధత‌తో ప‌ని చేస్తుంటే మ‌రికొంత మంది మాత్రం త‌మ స్వప్రయోజ‌నాల‌కు ఇలా ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకొని లాభాపేక్షతో ప‌ని చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కోట్లు ఖ‌ర్చయింది.. ఎవ‌రిస్తారు..?

కార్పొరేట‌ర్‌గా గెల‌వ‌డానికి ముందు ఇంటింటికి తిరిగి అనేక హామీలు, మాయ‌మాట‌లు చెప్పి ఓట్లు అభ్యర్థించిన అదే వ్యక్తి గెలిచాక జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ పత్రాల నుండి ఇంటి నిర్మాణ ప‌నుల వ‌ర‌కు ప్రతి ప‌నికి వెల క‌ట్టి పేద, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల నుండి దొరికినంత దోచుకో అంటున్నారు. ఓటు వేసి గెలిపించాం కాదా అని అడిగితే, కార్పొరేట‌ర్లుగా గెల‌వ‌డానికి కోట్లు ఖ‌ర్చు పెట్టాము.. అవి ఎవ‌రు ఇస్తారు అంటూ ద‌బాయిస్తున్నారు. డ‌బ్బు తీసుకోకుండా ఎవ‌రు ఓటు వేయ‌లేదు.. ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బు ఎలా వ‌స్తుంది అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇంటి నిర్మాణానికి ఒక రేటు.. అంత‌స్తుకు ఒక రేటు.. అక్రమ నిర్మాణాల‌కు మ‌రొక‌ రేటు నిర్ణయించి బ‌హిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. కార్పొరేట‌ర్ మాట విన‌కుంటే ఇక అంతే సంగ‌తులు. వెంట‌నే అధికారులు అప్రమ‌త్తమై మీకు అనుమ‌తులు లేవు అంటూ నోటీసులు ఇస్తారు. కాద‌ని నిర్మిస్తే కూల‌కొడ‌తాం మీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక స‌క్రమ నిర్మాణ‌దారుల‌కు, అక్రమ నిర్మాణ‌దారుల‌కు చేసేదేమిలేక కార్పొరేట‌ర్లు చెప్పిన మాట విన‌క త‌ప్పడం లేదు.

Advertisement

Next Story