మిషన్​ కాకతీయ పథకానికి బ్రేక్​..!?

by Anukaran |   ( Updated:2021-06-06 11:04:31.0  )
Mission Kakatiya scheme
X

దిశ, తెలంగాణ బ్యూరో : చెరువుల పునరుద్ధరణ మిషన్​ ఆగిపోతోంది. నాలుగు విడతల్లో చెరువుల మరమ్మత్తులు చేపట్టినా.. ఈ ఏడాది మే నాటికి పనులు చేసిన 4,6‌‌‌‌‌‌00 వేల చెరువులకు బిల్లులు ఆగిపోయాయి. దాదాపు ఏడాది నుంచి ఈ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. మరోవైపు ఇక నుంచి చెరువుల మరమ్మత్తులకు ప్రభుత్వం బ్రేక్​వేసింది. కారణాలేమైనా చెరువుల పనులను ఉపాధి హామీ నుంచి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెరువుల పనులకు మిషన్​కాకతీయ కింద ప్రతిపాదనలు పంపించగా… వాటిని మొత్తం పెండింగ్​లో పెట్టారు. ఇక నుంచి చెరువు మరమ్మత్తుల పనులను ఉపాధి హామీ నిధులతో చేపట్టాలని, దాని కోసం అంచనాలు తయారు చేయాలని సూచించినట్లు సమాచారం.

4,6‌00 చెరువుల బిల్లుల్లేవ్

మిషన్​ కాకతీయలో దాదాపుగా రెండేండ్ల నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కొన్ని చెరువుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. మూడు, నాలుగో విడతలో చేపట్టిన 4,600 చెరువుల పనులకు బ్రేక్​ వేసినట్లైంది. మరోవైపు వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో చెరువు పనులను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. ఎలాగూ బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో వాటి పరిశీలనకు కూడా అధికారులు కదలడం లేదు.

రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. దాదాపుగా 22 వేల పనులు పూర్తయ్యాయి. అయితే ఈ పథకం తొలినాళ్లలో వేగం పెంచారు. కానీ మొదటి, రెండో విడతలో చేసినంత వేగంగా మూడు, నాలుగో దశల్లో ముందుకు కదలడం లేదు. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా దాదాపు 4 వేలు పూర్తి చేసినట్లు అధికారులు చెప్పుతున్నారు. వాటికి సంబంధించిన మిగిలిన చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని గతేడాది జూన్‌ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. నాల్గో విడతలో 4,214 చెరువుల పనుల్లో ఇప్పటివరకు 2 వేలే పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల పనులు పూర్తి కాలేదు. పూర్తి చేసిన వాటికి బిల్లులు కూడా రావడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు చేస్తుండటంతో మిషన్‌ కాకతీయ వెనకబడింది. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

నిధులు ఇవ్వడం లేదు

మిషన్​కాకతీయ కింద ప్రస్తుతం రూ. 600 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పెండింగ్​ బిల్లులు దాదాపు రూ. 800 కోట్ల వరకు ఉండగా… ఇరిగేషన్‌ శాఖ పునర్​ వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రంలో రూ. 20 లక్షల కన్నా తక్కువ బిల్లులున్న వాటికి చెల్లింపులు చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో కొన్ని బిల్లులు చెల్లించారు. ఇంకా దాదాపు రూ. 6‌‌00 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో అటు పనులు కూడా ఆగిపోయాయి. దీంతో మిషన్‌ కాకతీయ మొదట్లో ఒక ఉద్యమంలా సాగినా… నాలుగు దశలకు వచ్చేసరికి నిధుల కొరతతో నీరసించింది.

పునర్‌ వ్యవస్థీకరణతో ఇప్పుడు మరింత కష్టం

జల వనరుల శాఖ పునర్‌వ్యవస్థీకరణతో మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం పూర్తిగా రద్దయింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవడంతో సీఈల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఈ పునర్‌వ్యవస్థీకరణ మేరకు చెరువుల ఒప్పందాల ఫైళ్ల విభజన, పని విభజన జరగాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో ఇది తేలినా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం కొలిక్కి రావడం లేదు. ఇది విభజన అనంతరం డివిజన్‌ల వారీగా వీటి పురోగతిని సీఈలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంకా పని విభజన, హద్దులు, కేటాయింపులు, బదిలీల భాగోతం వంటి అంశాల్లోనే జల వనరుల శాఖ సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు పనులపై ఎప్పుడు దృష్టి పెట్టుతారు, పాత బిల్లులను ఎప్పుడు తేలుస్తారనేది ఇంకా సందిగ్థమే.

ఖర్చ చేసింది సగమే

రాష్ట్రంలో మొత్తం 46,571 చెరువులున్నాయి. ఆయకట్టు చెరువులు 38,451 చెరువులు కాగా మిగతావి కుంటలు ఉన్నాయి. ఇందులో గొలుసుకట్టు చెరువులు 5,500 వరకు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని ఆయకట్టు 25,92,437 ఎకరాలు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో 26,690 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ.9,155.97 కోట్ల అంచనాతో నాలుగు విడుతలుగా చేపట్టిన పనులతో దాదాపు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మిషన్‌ కాకతీయ కింద రూ. 4,352.18 కోట్లను ఖర్చు పెట్టారు.

మంజూరు ఆపేశారు

2018లో నాలుగో విడుత మిషన్​ కాకతీయకు మంజూరు ఇచ్చిన ప్రభుత్వం… ఆ తర్వాత నుంచి ఆపేసింది. ముందుగా రూ. 9 వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పినా… రూ. 4 వేల కోట్లకే పరిమితమైంది. దీంతో మిగిలిన చెరువుల పనులకు ప్రతిపాదనలు పంపినా కాగితాల్లోనే ఉన్నాయి. నిధులు విడుదల చేయడం లేదు. ఐదో విడుతలో కూడా చెరువు పనులు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు ఆ శాఖలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం మిషన్​ కాకతీయకు బ్రేక్​ పడింది.

ప్రత్యేకంగా మిషన్​ కాకతీయకు నిధులను ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇంకా పనులేమైనా చేయాల్సి వస్తే వీటిని ఉపాధి హామీ నుంచి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీర్లకు ఆదేశాలిచ్చినట్లు ఇరిగేషన్​ అధికారులు చెబుతున్నారు. అంటే మిషన్​ కాకతీయను ఆపేసినట్లేనని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed