ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌ ఎంట్రీకి బ్రేక్.. అడ్డుకుంది అతనేనా..?

by Anukaran |
ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌ ఎంట్రీకి బ్రేక్.. అడ్డుకుంది అతనేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి.. రాజకీయ పరిణామాల వల్ల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం గులాబీ బాస్ నిర్ణయంతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే.. ఇటీవల తెలంగాణలో మారుతున్న పాలిటిక్స్‌ను బేస్ చేసుకున్న ధర్మపురి శ్రీనివాస్.. మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఆయన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన సోనియా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్.. పదవీకాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం డీఎస్‌ చేరికపై వ్యతిరేకత కనిపిస్తోంది. డీఎస్‌ రాకను రాష్ట్ర పార్టీ నేతలతో పాటు నిజామాబాద్‌ జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే.. సోనియాతో చర్చల తర్వాత డీఎస్‌ పార్టీలోకి ఎంట్రీ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ నిజామాబాద్‌ నేతలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేరికను స్థానిక నేతలు వ్యతిరేకించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవల కాలంలో డీఎస్ కొడుకు, బీజేపీ ఎంపీ అర్వింద్.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు కూడా ఇందుకు ఓ కారణమంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది.

కానీ, ఇవేవీ పట్టించుకోని అధిష్టానం ఆయన చేరికపై సుముఖతగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం మరో ఆరు నెలలకుగాపైగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక పార్టీ మారితే ఫిరాయింపు చట్టం వర్తించే అవకాశం ఉండటంతో పార్టీ మార్పును కొంత కాలం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన శుక్రవారమే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సింది. అయితే, మాణికం ఠాగూర్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అందిన ఆదేశాలతో చివరి నిమిషంలో డీఎస్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో డీఎస్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed