'ఉమ్మిని ఉపయోగించేది అందుకే'

by Shyam |
ఉమ్మిని ఉపయోగించేది అందుకే
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఏకంగా క్రికెట్‌లో కొత్త రూల్స్ తీసుకొని రావల్సి వచ్చింది. ఇందులో బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దడాన్ని నిషేధించడం ముఖ్యమైనది. ఈ నిర్ణయంపై బౌలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఉమ్మిపై నిషేధం తాత్కాలికమే అని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. కాగా, అసలు ఉమ్మిని ఎందుకు ఉపయోగిస్తారో భారత పేసర్లు షమి, ఇర్ఫాన్ పఠాన్‌లు ఒక కార్యక్రమంలో చెప్పారు. ‘బంతి బరువు పెరిగేందుకు, మృదువుగా చేయడానికి మాత్రమే చెమట ఉపయోగపడుతుంది. కానీ, రివర్స్ స్వింగ్ రాబట్టాలంటే ఉమ్మిని వాడాల్సిందే. ఎందుకంటే ఉమ్మి రుద్దడం వల్ల బంతి మెరుపు పెరగడంతోపాటు గట్టిగా అవుతుంది. దీంతో రివర్స్ స్వింగ్ రాబట్టడం తేలిక అవుతుంది’ అని షమి అన్నాడు. ఉమ్మిపై నిషేధం వల్ల రివర్స్ స్వింగ్ రాబట్టడానికి చాలా కష్టపడాల్సిందేనని చెప్పాడు. ‘ఉమ్మి వాడకపోతే బంతి గాలిని కోయలేదు. బంతిని గట్టిగా చేసి మెరుపు తెప్పిస్తేనే గాలిని కట్ చేసి బంతి రివర్స్ స్వింగ్ అవుతుంది. ఇప్పుడు నిషేధం వల్ల టెస్ట్ క్రికెట్‌పై ప్రభావం పడునుంది’ అని ఇర్ఫాన్ అన్నాడు. ఇక స్పిన్నర్లు చాహల్, కుల్దీప్, హర్భజన్ కూడా ఈ విషయంపై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఉమ్మి వాడకపోతే బంతిపై పట్టు చిక్కదు. దానివల్ల బంతిని డ్రిఫ్ట్ చేయలేం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలాగోలా నెట్టుకొచ్చినా సుదీర్ఘంగా బౌలింగ్ చేయాల్సిన టెస్టు క్రికెట్‌లో మాత్రం కష్టమని’ కుల్దీప్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed