మంత్రులకు ఎదురు దెబ్బ

by Shyam |   ( Updated:2020-12-04 09:06:17.0  )
మంత్రులకు ఎదురు దెబ్బ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తామై వ్యవహరించిన మంత్రులకు ఎదురు దెబ్బ తగిలేలా ఓటర్లు తీర్పునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విరామం లేకుండా మంత్రి కేటీఆర్ రోడ్ షో లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ప్రసంగంలోనూ బీజేపీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడారు. నగరంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెజాన్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. రాష్ట్రం నుండి కేంద్రానికి రూ 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో కట్టామని, తిరిగి కేంద్రం నుండి రాష్ట్రానికి కేవలం రూ 1.40 లక్షలు మాత్రమే వెనక్కు వచ్చాయని అన్నారు.

తెలంగాణలో తాము లోకల్ అని, బీజేపీ నాన్ లోకల్ అని, లోకల్ పార్టీకి ఓట్లు వేసి తిరిగి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. సుమారు వారం రోజుల పాటు నగరంలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించి ప్రతి చోట చేసిన ప్రసంగాలు ఓటర్లను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఓ దశలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకున్నా నోటాకు వేయాలని సూచించారు. ఇది గ్రేటర్ ప్రజలు ఆయనను విశ్వసించడం లేదని ముందుగానే ఊహించి చేశారని , గ్రేటర్‌లో పట్టు కోల్పోతున్నారనడానికి ఇది చాలు అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది.

ఇదే విషయమై పలు చోట్ల చర్చలు కూడా జరిగాయి. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ప్రతి గంట గంటకూ ట్రెండ్ మారుతుందని అనడం కూడా వారిలో మనో దైర్యం పోయిందని, ఓటమిని ముందుగానే ఊహించారనే ప్రచారం జోరుగా సాగింది. ఇది కూడా గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై ప్రభావం చూపిందని తెలుస్తోంది. దీనికితోడు దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా , రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసి ఓటర్లను ఆకట్టుకోవడంతో పార్టీ ఊహించిన దాని కంటే అధిక డివిజన్లను కైవసం చేసుకుంది.

ముంచిన వరద ముంపు సహాయం.

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే టీఆర్ఎస్ పార్టీ వరద ముంపు సహాయం కింద ప్రతి కుటుంబానికీ రూ 10 వేలు అందజేశారు. అనంతరం నోటిఫికేషన్ జారీ కాగా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారందరికి నగదును బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. ఐతే ముంపు బాధితులు ప్రతి రోజూ మీ సేవా కేంద్రాలకు వందల సంఖ్యలో పోటెత్తినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వచ్చింది. దీంతో ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని బాధితులు బాహాటంగానే తిట్టిపోశారు.

చివరకు కోర్టు ఆదేశాలతో ముంపు సహాయం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇలా వరద ముంపు సహాయంతో టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని ఊహించినప్పటికీ లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. దీనికి తోడు బీజేపీని గెలిపిస్తే వరద ముంపు సహాయం కింద రూ 25 వేలు ఇస్తామని పార్టీ నాయకులు చేసిన వాగ్ధానాలు ప్రజలలోకి బాగా వెళ్లాయి. కర్ణుని చావుకు కారణాలనేకం అనే విధంగా గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పట్ల మారాయి.

ఇలా వచ్చామా … అలా వెళ్లామా అనేలా మంత్రుల తీరు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఉప సభాపతి పద్మారావు గౌడ్ లు నగరంలోని పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐతే మంత్రుల పర్యటన సందర్భంగా వారు ప్రజలతో మమేకం కాకుండా కేవలం పార్టీ నాయకులతో ఏసీ గదులలో సమావేశాలు నిర్వహించి వెళ్లారు. ఎక్కడ కూడా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేయకపోవడం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మంత్రి తలసాని గోషామహల్ నియోజకవర్గంలో ఓ నాయకుని కూతురుకు టిక్కెట్ ఇప్పించడంతో పాటు నామినేషన్ వేసే సమయంలో కూడా హాజరై ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు.

సదరు నాయకునితో మంత్రికి లోపాయికారి ఒప్పందం ఉండడమే కారణమని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా నాంపల్లి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ కూతురుకు కూడా టిక్కెట్ ఇప్పించడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఇలా పలు చోట్ల గెలిచే సామర్ధ్యం ఉన్న నాయకులను కాదని టిక్కెట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైందనే చర్చ పార్టీ వర్గాలలో జోరుగా సాగింది. ఇదే తీరులో ఇతర మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి , ఉప సభాపతి వ్యవహరించడంతో వారికి ప్రజల నుండి ప్రతిఘటన ఎదురై ప్రచారం సమయంలోనే నిలదీసిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ పతనం.. కేసీఆర్ బయటకు రావాలి: బండి సంజయ్

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed