స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అన్యాయం జరగదు..ఎంపీ జీవీఎల్

by srinivas |   ( Updated:2021-03-02 09:25:28.0  )
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అన్యాయం జరగదు..ఎంపీ జీవీఎల్
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఉత్తరాంధ్రలో ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. అన్ని పార్టీలు కలిసి పోరుబాటపట్టాయి. రోజూ ఏదో ఒకవైపు ఉద్యమం రగులుతూనే ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రైవేటీకరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు నష్టం లేకుండా కేంద్రం చూస్తుందని అన్నారు. సరైన సమయం వస్తే ఉద్యోగులే కర్మాగారంలో భాగస్వాములయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

విశాఖపట్నంలో పర్యటించిన ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్రం ఆలోచిస్తోందని..అందువల్లే ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగిందని అన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ పథకాలు, వేల కోట్లు నిధులు ఏపీకి ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇంతలా నిధులు ఇస్తుంటే బీజేపీకి ఏమి ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీని ఆదరించాలని కోరారు.

రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారమైపోయాయని.. ధన రాజకీయాలకు స్వస్తి పలికాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని ప్రజలకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. 12 కార్పొరేషన్, 74 మున్సిపాలిటీల్లో జనసేన, బీజేపీ కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని.. ప్రజలంతా తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. మరోవైపు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అభివృద్ధి పై కేంద్రం దృష్టి పెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగదని..జరగనివ్వమని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed