పది రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ

by Shamantha N |   ( Updated:2021-01-11 07:07:09.0  )
పది రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ
X

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వైరస్ పది రాష్ట్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోనూ బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టు కొత్తగా గుర్తించింది. ఇది వరకు ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్టు ల్యాబ్‌లు గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా, రాజస్తాన్‌లో టోంక్, కరౌలి, బిల్వారా జిల్లాలు, గుజరాత్‌లోని వల్సాద్, వడోదరా, సూరత్ జిల్లాలు, ఉత్తరాఖండ్‌లోని కోద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ మరణాలను ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ గుర్తించింది. మహారాష్ట్రలోని ముంబయి, థానె, పర్బని, దపోలి, బీడ్‌లలోనూ ధ్రువీకరించింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

హాట్‌స్పాట్‌లను గుర్తించి జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ శాఖ రాష్ట్రాలకు సూచించింది. సరస్సులు, కుంటలు, జూ, లైవ్ బర్డ్ మార్కెట్లు, పౌల్ట్రీ ఫామ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను హతమార్చేటప్పుడు పీపీఈ కిట్‌లను ధరించాలని, పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా, పశువులు, పక్షుల కోసం అందుబాటులో ఉన్న టీకాలపై దృష్టి సారించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(వ్యవసాయం) కేంద్రానికి సూచనలు చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా మహారాష్ట్రలో ఎనిమిది వేల పక్షులను వధించనున్నారు. కేరళలో గతవారం బర్డ్ ఫ్లూతో 12వేల బాతులు మరణించిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించకుండా వేలాది సంఖ్యలో పక్షులను వధించారు. హర్యానా పంచకులా జిల్లాలో 1.6లక్షల పక్షుల వధ ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed