పాన్ ఇండియా మూవీగా ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్

by Jakkula Samataha |
పాన్ ఇండియా మూవీగా ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్
X

ఫిల్మ్ ఇండస్ట్రీలో గతేడాదంతా బయోపిక్‌ల హవా కొనసాగగా.. 2020లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. అన్ని భాషా చిత్రాల్లోనూ వీటి జోరే కనిపిస్తోంది. ప్రస్తుతం మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా వంటి దిగ్గజ క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే కోవలో తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడల్ విజేత క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రికి సంబంధించి బ‌యోపిక్ రూపొంద‌నుంది.

మేరీకోమ్, సచిన్, ధోనీలపై వచ్చిన బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ తరహా సినిమాలను భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేసే అవకాశాలుండటంతో.. ఫిల్మ్ మేకర్స్ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2000లో జ‌రిగిన ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించి, ఒలింపిక్స్‌ ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్క‌రించ‌నున్నారు. ‘రాజుగాడు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి.. కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తెర‌కెక్కించ‌నుండ‌గా, ఆమె ఇది ‌ తన కలల ప్రాజెక్టు అని తెలపడం విశేషం. ఈరోజు (జూన్ 1న) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియ‌న్ మూవీగా రానున్న ఈ బ‌యోపిక్‌‌లో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలోనే ప్ర‌క‌టించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed