- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు తెలిసే జరిగిందా.. మిస్టరీగా కౌశిక్‌రెడ్డి పోస్ట్ పెండింగ్..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: అంతా అయిపోయిందనుకుంటున్న తరుణంలో ఆ నాయకుడికి షాకిచ్చినట్టయింది. పదవి వచ్చిందన్న ధీమాతో ఉన్న ఆయనపై పిడుగు పడింది. అధికార పార్టీ అధినేత అన్నింటా ఆశీస్సులు అందిస్తున్నా అసలుకాడ కొర్రి పడింది. దీంతో ఆ నాయకుడి ఆశలు అడియాసలేనా అన్న చర్చ మొదలైంది.
అలా వచ్చి..
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో హుజురాబాద్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పుకున్న ఆరు రోజుల్లోనే జాక్ పాట్ కొట్టేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీర్మాణం చేసి ఫైలును రాజ్‌భవన్‌కు పంపించింది. ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ నేటికీ సంతకం చేయలేదు. నేడో రేపో గవర్నర్ తమిళి సై క్లియరెన్స్ ఇస్తారనుకుంటున్న తరుణంలో షాక్ లాంటి విషయం చెప్పారు. సామాజిక సేవ అందించే వారి కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించింది. అయితే ఆయన సోషల్ యాక్టివిటీ ఏం చేస్తారో తెలుసుకోవాల్సి ఉంది అన్నట్టుగా గవర్నర్ వ్యాఖ్యానించడంతో కౌశిక్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రతిపాదనలు పంపిన వారిపై ఆరా తీసి తుది నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు గవర్నర్‌కు ఉంటాయి. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి సామాజిక సేవకుడేనన్న విషయంపై రాజ్ భవన్‌కు క్లారిటీ రావాల్సి ఉంటుందని స్పష్టం అవుతోంది.
క్రిమినల్ కేసులు..
నేర చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే కౌశిక్ రెడ్డిపై ఉన్న పలు కేసులు కూడా ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డుపడుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కౌశిక్ రెడ్డి క్రిమినల్ కేసుల విషయంలో ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇక్కడ మాత్రం ఇలా..
కౌశిక్ రెడ్డి అధికారికంగా మాత్రం ఎమ్మెల్సీ కాలేదన్నది వాస్తవం. కానీ, హుజురాబాద్ ఉప ఎన్నికలో జరుగుతున్న ప్రచారం మాత్రం విచిత్రంగా ఉందనే చెప్పాలి. హుజురాబాద్ ప్రజలను కౌశిక్ రెడ్డి కలిసినప్పుడు తనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని బాహాటంగానే చెప్తున్నారు. మరో వైపున మంత్రి హరీష్ రావు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. జమ్మికుంటలో జరిగిన వేర్వేరు ప్రోగ్రామ్స్‌లో కూడా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారన్న రీతిలోనే చెప్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే రూ. 5 కోట్లు, ఎమ్మెల్సీ అయిన కౌశిక్ రెడ్డి ద్వారా మరో రూ. 5 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వస్తాయని ప్రకటిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే రూ. 10 కోట్లు మీ ప్రాంతం కోసమే వెచ్చించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి చేస్తున్న కామెంట్లను పరిశీలిస్తే కౌశిక్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయాడనే చెప్తున్నట్టుగా ఉంది. కానీ, గవర్నర్ మాత్రం ఇంకా పరిశీలించాల్సి ఉందని ప్రకటించడం గమనార్హం.
తెలిసేనా.. తెలియకనా..
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక రహస్యం ఏంటో అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్న వారూ లేకపోలేదు. సామాజిక సేవ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేబినెట్ తీర్మాణం చేయడంతోనే చాలదని, ఈ ఫైలుపై గవర్నర్ సంతకం పెట్టాల్సి ఉంటుందన్నది వాస్తవం. దీంతో కౌశిక్ రెడ్డి చేస్తున్న సామాజిక సేవపై గవర్నర్ వివరాలు తెలుసుకున్న తరువాత రాజ్‌భవన్ వర్గాలు ఫైల్‌ను తిప్పి పంపే అవకాశాలు కూడా లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా తెలిసే సీఎం కౌశిక్‌ను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ పంపారా లేక కేబినెట్ తీర్మాణానికి అనుగుణంగానే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్న ధీమాతో పంపారా అన్నదే మిస్టరీగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
రెండు పార్టీలకు షాకేనా..?
కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో బీజేపీకి షాకిచ్చినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే.. టీఆర్ఎస్ పార్టీకి కూడా షాక్ తగిలినట్టయింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ ఇంకా పెండింగ్‌లో ఉందని స్పష్టం కావడం గులాబీ పార్టీకి మింగుడు పడని విషయమనే చెప్పాలి. హుజురాబాద్‌లో బలమైన సామాజిక వర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ హోల్డ్‌లో ఉండడంతో టీఆర్ఎస్ పార్టీపై కూడా ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.