కానిస్టేబుళ్లను ప్రశంసించిన భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్

by Sridhar Babu |   ( Updated:2021-10-08 05:40:14.0  )
SP Sunil Dutt
X

దిశ, భద్రాచలం: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా వారికి శిక్షలు పడే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్.. పోలీసులకు సూచించారు.‌ శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. సబ్ డివిజన్ పరిథిలోని పోలీస్ స్టేషన్ల పనితీరును, పలు కేసుల వివరాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అన్ని కేసుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టి నేరాలు చేసేవారికి శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.‌ గంజాయి రవాణాను అడ్డుకోవడంలో జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్నారు. వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలోని నగదును మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ, ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భద్రాచలం సబ్ డివిజన్‌లో విధి నిర్వహణలో ప్రతిభ చూపుతున్న కానిస్టేబుళ్లు ఆదిత్య (భద్రాచలం టౌన్), వెంకట్రావు (భద్రాచలం ట్రాఫిక్), కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సీతారాములు, శ్రీనివాస్‌‌లకు ఎస్పీ రివార్డులు అందజేశారు. అనంతరం ఏ‌ఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి. వినీత్, భద్రాచలం సీఐ స్వామి, దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు మధుప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed