ఆర్టీసీకి కాస్త ఉపశమనం

by Anukaran |   ( Updated:2020-07-23 23:40:53.0  )
ఆర్టీసీకి కాస్త ఉపశమనం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కరోనా కారణంగా ప్రతి రంగమూ కుదేలైంది. ఇందులో రవాణా రంగం సైతం ఉంది. పెంచిన చార్జీలతో కాస్త ఆదాయం మెరుగుపడుతున్న సమయంలో కరోనా దెబ్బ ఆర్టీసీపై పడింది. దీంతో సంస్థ తిరిగి అప్పుల్లో కూరుకుపోతోంది. ఇటీవలే కార్గో సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించడంతో ఆర్టీసీకి కొంతలోకొంత ఉపశమనం లభిస్తున్నది.

కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాల్లో మునిగిపోతోంది. ఉన్న అప్పుల్లోంచి ఎలా భయటపడాలని ఆలోచిస్తుండగానే కరోనా దెబ్బకు ములిగే నక్కమీద తాటికాయపడ్డట్టు అయింది ఆర్టీసీ పరిస్థితి. ఆర్టీసీకి లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. అయినా బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలోనే సుమారు రెండు నెలల పాటు డిపోలకే పరిమితమైన బస్సులు ప్రస్తుతం రోడ్డెక్కినా ఆశించిన ఆదాయం రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి ఏర్పడితే కరోనాకు భయపడి సొంత వాహనాలనే వాడుతున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికులు చాలా మంది బస్సుల్లో ప్రయాణించేందుకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 505 ఆర్టీసి బస్సులు ఉండగా మరో 389 అద్దె బస్సులు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4048 ఆర్టీసి సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతిరోజూ జిల్లాలో బస్సులు 2.60లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థలాలకు చేరవేస్తూ రూ.కోటీ 30లక్షల ఆదాయం సేకరించేది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా జిల్లాలో ఆర్టీసీకి రూ.35కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ కరోనా కారణంగా ఈ ఆదాయం పూర్తిగా పడిపోయింది. చివరకు కార్మికులకు నెలవారి వేతనాలు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పనిచేస్తున్న 4048మంది కార్మికుల వేతనాల కోసం ప్రతినెలా రూ.8కోట్లా 60లక్షలు అవసరమని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు పూర్తిగా తలకిందులు కావడంతో ఆర్టీసీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు.

అందుబాటులోకి కార్గో సేవలు
ప్రయాణికులు లేక నష్టాల్లో మునిగిపోతున్న ఆర్టీసీకి కార్గో సేవలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఆదరణ లభిస్తుండడంతో సంస్థకు కాస్త ఊరట లభిస్తోంది. రోజుకు సుమారుగా 50 కంటే ఎక్కువ పార్సిళ్లు వస్తున్నాయి. కొన్ని కీలక కేంద్రాల్లో వీటి సంఖ్య 150కి పైగానే ఉండడం అధికారులకు కాస్త ఉరట కలిగిస్తున్నది. గత నెల పార్సీళ్ల రూపంలో ఆర్టీసీకి సుమారు రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చింది. దీని నిర్వహణ కోసం సంస్థకు ఎలాంటి అదనపు భారం లేకుండా ఉన్న సిబ్బందినే వినియోగిస్తున్నారు. కార్గో సేవలను వ్యాపారులు వినియోగిస్తున్న నేపథ్యంలో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సేవలను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed