క్రికెటర్లందరికీ పూర్తి వేతనాలు ఇచ్చిన బీసీసీఐ

by vinod kumar |

టీమ్ ఇండియా, ఇతర క్రికెటర్లందరికీ గత త్రైమాసికంలో చెల్లించాల్సిన పూర్తి వేతనాలను ఇచ్చేసినట్లు బీసీసీఐ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల బీసీసీఐకి ఆర్థికంగా నష్టాలు ఎదురవుతున్నా.. ఆటగాళ్లు ఇబ్బంది పడకూడదనే కారణంతో వారికి పూర్తి జీతాలు చెల్లించినట్లు బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా క్రికెట్ బోర్డుల ఆదాయాలు తగ్గిపోయాయి. దీంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్పటికే క్రికెటర్లు, సహాయక సిబ్బంది వేతనాల్లో కోత విధించనున్నట్టు వెల్లడించాయి. భారత క్రికెటర్లు కూడా కోతలకు సిద్ధపడాలని ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్హోత్రా వ్యాఖ్యానించగా.. అతని వ్యాఖ్యలపై గవాస్కర్ మండిపడిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్ తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంట్రాక్టు ఆటగాళ్లకు ప్రతీ త్రైమాసికంలో చెల్లించే వాయిదాలను క్లియర్ చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బీసీసీఐ వేతనాలు పూర్తిగా చెల్లించినా.. తమ ఆటగాళ్ల వేతనాల కోత విషయంలో అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బోర్డులు తెలపడం గమనార్హం.

Tags : Cricketers Salaries, BCCI, Gavaskar, Contract Players, England, Australia

Advertisement

Next Story

Most Viewed