బీసీలకు దక్కని రాజకీయ ప్రోత్సాహం

by Shyam |
Gangula-Kamalakar
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల(బీసీ) కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఉన్నా.. వాటికి ఏడేండ్లుగా ఛైర్మన్లను నియమించడం లేదు. కుల, వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఛైర్మన్లను నియమించకపోవడం గమనార్హం. ఫెడరేషన్లకు ఛైర్మన్లు లేకపోవడంతో రాజకీయంగా వెనకబడటమే గాక, తమ సమస్యలపై అవగాహన కలిగి, మేలు చేసే వారు లేకుండా పోయారని ఆయా కులాల్లో వ్యక్తమవుతోంది.

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 12 ఫెడరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఏ ఒక్కదానికి గడిచిన ఏడేండ్లలో చైర్మన్లను ప్రభుత్వం నియమించలేదు. బీసీల పరిధిలో కుల ఫెడరేషన్లకు అదే కులానికి చెందిన వ్యక్తులు మాత్రమే చైర్మన్లుగా నియమితులవుతుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఫెడరేషన్లకు చైర్మన్లను నియమకాలు ఊసే లేదు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రజక, సగర, పూసల, శాలివాహన, విశ్వబ్రాహ్మణ, గౌడ, నాయీబ్రాహ్మణ, వడ్డెర, వాల్మీకీ, భట్రాజ, మేదర, ఎంబీసీ ఫెడరేషన్లకు వేర్వేరుగా ఛైర్మన్లను నియమించాల్సి ఉంది. స్వరాష్ట్రంలో చేతివృత్తులను ప్రోత్సహించి, ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తామని సీఎం కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. అయితే బీసీ కులాలకు సంబంధించిన ఫెడరేషన్ల ఛైర్మన్ల నియామకం లేకపోవడంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తిత్వం ఉండదని ఆయా కుల సంఘాలు నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక సహాయాలు, పథకాలే తప్ప వృత్తిదారుల పరిస్థితులపై అధ్యయనం, అవసరమైన కార్యక్రమాలను రూపొందించే వ్యవస్థ లేకుండా పోయిందనేది వారి వాదన. ఫెడరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తే ఆయా కులాలకు చెందిన వ్యక్తులే ఉండటం వల్ల సమస్యలు చెప్పుకోవడం సులభమవుతుంది. సొంత కులానికి చెందిన క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, సమస్యలను అర్థం చేసుకోవడం కూడా సాధ్యమవుతుందని సంఘాల నాయకులు చెబుతున్నారు. కుల ఫెడరేషన్ల ఛైర్మన్లు అదే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కలవడం, సమస్యలను చెప్పుకునేందుకు సామరస్య వాతావరణం ఏర్పడటం వారి సంక్షేమానికి దారితీయనుంది.

చైర్మన్ల నియమించి రాజకీయ ప్రోత్సాహామివ్వాలి : రాచమల్ల బాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

బీసీ సామాజిక కులాలకు తగిన ప్రోత్సహం లభించడం లేదు. బీసీలకు రాజకీయ ప్రోత్సహకంగా ఫెడరేషన్ల ఛైర్మన్ల నియామకాలు అవసరం. రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలతో నేరుగా సంబంధమున్న చైర్మన్ల నియామకాలు చేపట్టకపోవడం బాధాకరం. కరోనా వచ్చిన తర్వాత వృత్తిదారుల సమస్యలు ఇంకా పెరిగాయి. ఆర్థిక కష్టాలతో కుటుంబాలను కూడా పోషించుకోవడం కష్టమవుతోంది. ప్రభుత్వ పథకాలను అందుకోవడంలోనూ ఫెడరేషన్లకు చైర్మన్లు కీలకంగా మారనున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది.

ఎంబీసీ కుటుంబాలపై అధ్యయనం జరగాలి : కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ రాష్ట్ర కో–కన్వీనర్

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీసీ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారి పరిస్థితులు దిగజారిపోయి వృత్తులకు దూరమవుతున్నారు. ఆర్థిక, సామాజికంగా దెబ్బతిని ఉనికి లేకుండా పోతున్న ఎంబీసీలను కాపాడుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం ఫెడరేషన్ బాధ్యత తీసుకోవాలి. ఎంబీసీల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తులను ఫెడరేషన్ చైర్మన్‌గా నియమించి సమగ్ర అధ్యయనం చేయాలి. ఎంబీసీల అభివృద్దికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి. బీసీ కులాల్లోని అన్ని ఫెడరేషన్లకు చైర్మన్లు లేరు. ఖాళీగా ఉన్న అన్ని ఛైర్మన్ల పోస్టుల్లోనూ నియామకాలు పూర్తి చేయాలి.

Advertisement

Next Story