హుజురాబాద్ ఉప ఎన్నిక సెమీ ఫైనల్ : జాజుల శ్రీనివాస్

by Shyam |
Jajula Srinivas
X

దిశ, ఖైరతాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సబ్బండ వర్గాల మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. ఈటల రాజేందర్ వల్లే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయని అన్నారు. ప్రస్తుతం దళిత బంధు పథకం కూడా ఈటల రాజేందర్ పుణ్యమే అని అన్నారు. 2023 ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నిక సెమీ ఫైనల్ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

మరో 20 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అని స్వయంగా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు కళ్లు తెరవాలని అన్నారు. ఫూలే అంబేద్కర్‌ల ప్రతిరూపమే ఈటల రాజేందర్ అని, హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని పాతర వేయనుందని అన్నారు. హుజురాబాద్ ఓటర్లు ధర్మం, న్యాయం వైపు ఉండాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ నెహ్రూ నాయక్, మాల హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఈసం లింగయ్య, కేంద్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇరుగు నరేందర్, శ్రీనివాస్ ముదిరాజ్, మైనార్టీ నాయకులు యూసుఫ్ బాబు పాల్గొన్నారు.

Advertisement

Next Story