స్నేహానికి గుర్తుగా.. వజ్రానికి పేరు

by Shyam |   ( Updated:2020-09-26 01:25:31.0  )
స్నేహానికి గుర్తుగా.. వజ్రానికి పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ పని చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటుంటారు. అయితే, ఇక్కడ ఓ బ్యాంక్ మేనేజర్‌కు ఆవగింజంత కాదు, గుమ్మడికాయంత అదృష్టం ఉన్నట్లుంది. స్నేహితులతో కలిసి సరాదాగా పార్క్‌కు వెళ్లిన కెవిన్ కినార్డ్‌ అనే వ్యక్తికి వజ్రం దొరకడంతో.. ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు.

అమెరికా, ఆర్కన్సాస్‌లోని మౌమెల్లేలో కెవిన్ కినార్డ్‌ బ్యాంక్ మేనేజర్‌‌గా పనిచేస్తున్నాడు. ఇక ఆర్కన్సాస్‌లో ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌’ గురించి అందరూ వినే ఉంటారు. ఒకప్పుడు వజ్రాలతో నిండిన ఆ పార్క్‌లో ఇప్పటికీ చాలామంది సందర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ, అక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటారు. కళ్లను భూతద్దాలుగా చేసుకుని మరీ మూలమూలలను గాలిస్తుంటారు. ఇసుక రేణువుల్ని కూడా జల్లెడ పట్టేస్తుంటారు. 48 సంవత్సరాలుగా ఇక్కడ ఇదే తంతు కొనసాగుతోంది. కాగా, కెవిన్ కూడా తరచుగా ఆ పార్క్‌కు వెళ్తుంటాడు. కానీ వజ్రాలు వెతికేందుకు కాదు, సరదా కోసం మాత్రమే. అయితే, ఇటీవల తన స్నేహితులతో కలిసి పార్క్‌కు వెళ్లిన కెవిన్.. స్నేహితులతో పాటు తను కూడా వజ్రాలు వెతకడం ప్రారంభించాడు. అప్పుడే కెవిన్ కళ్లకు ఓ క్రిస్టల్ లాంటి రాయి కనిపించింది. అరే.. ఈ గాజు ముక్క ఏదో బాగుందే అనుకుని బ్యాగులో వేసుకున్నాడు.

పార్క్‌లో సందర్శకులు సేకరించిన రాళ్లను ‘డైమండ్ డిస్కవరీ సెంటర్‌’లో పరీక్షిస్తారు. వాటిలో వజ్రాలు ఉన్నట్లయితే.. ఆ వివరాలు నమోదు చేసుకుని సందర్శకులకు తిరిగి ఇచ్చేస్తారు. కెవిన్‌తో పాటు అతని స్నేహితులు తాము సేకరించిన రాళ్లను వారికిచ్చారు. దాన్ని పరీక్షించిన నిపుణులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పార్క్ చరిత్రలోనే అది రెండో అతి పెద్ద వజ్రం. 9.07 క్యారెట్ల బరువున్న ఆ వజ్రం విలువ కోట్ల రూపాయలు. కెవిన్ తన స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు వజ్రం దొరకడంతో.. దానికి ‘కినార్డ్ ఫ్రెండ్‌షిప్ డైమండ్’ అని పేరు పెట్టాడు. 48 ఏళ్ల పార్క్ చరిత్రలో 1975లో దొరికిన 16.37 క్యారెట్ల వజ్రమే అతిపెద్దది.

Advertisement

Next Story

Most Viewed