దాతృత్వంలో అజీమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానం!

by Harish |
దాతృత్వంలో అజీమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానం!
X

దిశ, వెబ్‌డెస్క్: దాతృత్వానికి పర్యాయంగా మారిన వారిలో దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రస్తుత సంవత్సరానికి గానూ అత్యధికంగా దానాలు చేసిన జాబితాలో ఈసారి కూడా ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. హురున్ రిపోర్ట్ ఇండియా నివేదిక ప్రకారం ఆయన రూ.7,904 కోట్లతో రోజుకు సగటున రూ. 22 కోట్ల విరాళాలను ఇచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో కరోనాతో పోరాడేందుకు విప్రో సంస్థ రూ. 1,125 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో దాతృత్వ కార్యకలాపాల కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఆదర్శంగా నిలిచారని, అందరికీ ఆయనే రోల్‌మోడల్ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ రహమాన్ జునైద్ చెప్పారు.

ఈ జాబితాలో అజీమ్ ప్రేమ్‌జీ తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రెండో స్థానంలో ఉన్నారు. శివ్ నాడార్ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.795 కోట్లను విరాళాల కోసం వినియోగించగా, గతేడాది రూ.826 కోట్లకు వెచ్చించారు. అలాగే, దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 3వ స్థానంలో రూ. 458 కోట్లను విరాళాల కోసం ఇచ్చారు. గతేడాది ముఖేశ్ రూ. 402 కోట్లను విరాళం ఇచ్చారు. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు చేసుకున్నారు. నందన్ నీలేకని రూ.159 కోట్లు, శిబులాల్ రూ.32 కోట్లు, గోపాలకృష్ణన్ రూ.50 కోట్లను విరాళంగా ఇచ్చారు.అంతేకాకుండా, రూ.5 కోట్లకు పైగా విరాళంగా ఇచ్చిన వారిలో 109 మంది ఉండగా, వీరిలో 7 గురు మహిళలు ఉన్నారు. రోహిణి నీలేకని రూ.47 కోట్లతో మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కాగా, ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ రూ.5.3 కోట్లతో అత్యంత చిన్న వయసువాడీఅ ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed