ట్రెండింగ్‌లో ‘అవ్వ.. గంగవ్వ’

by Jakkula Samataha |   ( Updated:2023-12-15 14:39:44.0  )
ట్రెండింగ్‌లో ‘అవ్వ.. గంగవ్వ’
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకరి గురించి పాట రాయాలంటే.. వాళ్లు సమాజంలో ఎంతో కొంత స్ఫూర్తి నింపినవారై ఉండాలి. అప్పుడే పాటలోని పదాల అల్లికకు అర్థం చేకూరుతుంది. మామూలుగా ఏ సినిమా స్టార్ మీదనో లేక అత్యంత ప్రభావశీలురైన పొలిటికల్ లీడర్ మీదనో పాటలు రావడం చూస్తూనే ఉంటాం. కానీ మొట్టమొదటిసారి ఒక యూట్యూబర్ మీద పాట వచ్చింది. రావడమే కాదు ఎంతో మందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ యూట్యూబర్ ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు మనందరి గంగవ్వ. మై విలేజ్ షో ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ పాట రిలీజైన ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్‌ సాధించగా.. పల్లెను, ప్రకృతిని, వాటితో గంగవ్వకున్న అనుబంధాన్ని తెలుపుతూ సాగడం విశేషం.

‘సలిగంగ తానాలు నీ నవ్వులు.. వరిచేల రాగాలు నీ చూపులు.. కరిమబ్బు మెరుపులు నీ పిలుపులు.. మురిపించు నవ్వించు నీ నటనలు’ అంటూ ప్రారంభమైన పాట గంగవ్వ జీవితాన్ని తెరపై ప్రతిబింబించగా.. ఎప్పటిలాగే ‘గంగవ్వ’ పేరు వినబడటంతో పాట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నీట్ అండ్ క్లీన్‌గా ఉన్న ఈ జానపద గేయం గురించి గంగవ్వ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓన్‌గా ప్రచారం చేస్తూ.. స్టార్ హీరోయిన్ల నటన.. నీ నటన ముందు ఎందుకు పనికిరాదని ప్రశంసిస్తున్నారు. అవ్వా.. నీతో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నామని, పల్లె ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా సినిమా తీద్దామని అంటున్నారు. గంగవ్వ తోపు అంటున్న అభిమానులు.. నాగార్జున ప్రామిస్ చేశారుగా.. ఇల్లు రెడీ అయిందా మరి! అని ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్‌లో తన ప్రెజెన్స్ మిస్ అవుతున్నట్లు చెబుతున్నారు.

యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు మంగళవారం ఈ పాటను రిలీజ్ చేయగా.. డాక్టర్ మెల్లగోడ గంగ ప్రసాద్ లిరిక్స్ అందించారు. మదీన్ ఎస్కే మ్యూజిక్ అందించగా.. హర్షిక గుడి గానాలాపన చేసి పాటకు ప్రాణం పోశారు. శివ కృష్ణ బుర్ర డైరెక్షన్‌లో.. అనిల్ జీల సినిమాటోగ్రాఫర్ కమ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించి మల్టీ టాలెంటెడ్‌గా నెటిజన్లచే శభాష్ అనిపించుకుంటున్నారు. మొత్తానికి ఈ పాటతో గంగవ్వను మరో మెట్టు ఎక్కించిన మై విలేజ్ షో టీమ్ సైతం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement

Next Story