అధికారుల పర్యవేక్షణ లోపం.. తాగొచ్చిన ఉపాధ్యాయుడు

by Shyam |
authorities Monitoring error
X

దిశ, కొత్తగూడ: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన మాష్టారు.. అసలు పని పక్కన పెట్టి పొద్దంతా మద్యం మత్తులోనే విహరిస్తోన్న దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పిల్లలు అక్షరాస్యులుగా మారి వారి ప్రాంత తలరాతల్ని రూపు మాపాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలను ఎంతో ఖర్చుచేసి నిర్వహిస్తోంది. అసలే కరోనా రక్కసి కారణంగా బడికి దూరమైన పిల్లలు ఇటీవలే పాఠశాలలకు వెళ్లడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఏజెన్సీ పిల్లలకు అందాల్సిన విద్య, కొందరి నిర్లక్ష్యం కారణంగా అందని ద్రాక్షగా మారింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న అధికారుల పర్యవేక్షణ లోపం బడీడు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో గట్టి లింగస్వామి అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం దాదాపు 10.30 గంటలకు ఆలస్యంగా రావడమే కాకుండా, మద్యం సేవించి వచ్చాడు. దీంతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు తాగి ఊగుతూ పాఠశాలకు రావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఉపాధ్యాయుడు లింగస్వామి ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదని రోజూ ఇది అతనికి మామూలేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ప్రారంభం అయినప్పటి నుండి ఇదే తంతు కొనసాగుతోందని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొట్టొచ్చిన పర్యవేక్షణ లోపం

గుండంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనపడుతోంది. ఏజెన్సీ పరిధిలో పాఠశాలల నిర్వహణ ఎలా జరుగుతుందో తెలియడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్తవానికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల కన్నా ట్రైబల్ పాఠశాలలపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ, సంబంధిత క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా బడుల్లో ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. మానిటరింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం, తనిఖీ చేయాల్సిన సిబ్బంది సైతం ఆమ్యామ్యాలకు అలవాటు పడటంతోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని బాధిత పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ పరిధిలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఉపాధ్యాయుడు లింగస్వామి రోజూ మద్యం తాగి వస్తున్నాడన్న విషయం గ్రామస్తులు, యూత్ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చారు. అతడిని గతంలో కూడా మందలించాం. తాజాగా అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – సక్రు బానోత్, ప్రధానోపాధ్యాయులు

Advertisement

Next Story

Most Viewed