క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు.. 50 పరుగులు

by Anukaran |
క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు.. 50 పరుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: అదేంటి ఒకే ఓవర్‌లో 6 బంతులే ఉంటాయి కదా, మరి 8 సిక్స్‌లు ఎలా కొట్టాడని అనుకుంటున్నారా ? ఇందులో రెండు బంతులు నోబాల్స్ ఉన్నాయి. క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడమే పెద్ద ఘనత అనుకుంటాం. ఇప్పటి వరకు యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హెర్షెల్ గిబ్స్, జస్కరణ్ మల్‌హోత్రాలు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవిశాస్త్రి, గార్‌ఫీల్డ్ సోబెర్స్, రాస్ విట్లే, హజ్రతుల్లా జజై, లియో కార్టర్, తిసారా పెరారా ఈ అరుదైన ఫీట్‌ సాధించారు. అయితే ఈ అందరి రికార్డులను వెనక్కినెట్టుతూ ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మాన్ సామ్ హారిసన్ ఏకంగా ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు బాదాడు. బౌలర్ వేసిన రెండు నోబాల్స్‌ను సైతం సిక్స్‌గా మలిచిన అతను క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

పెర్త్ వేదికగా నార్త్ సబర్బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్ సమక్షంలో జరిగిన గ్రేడ్ క్రికెట్‌లో సామ్ హారిసన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచులో సోర్రెంటోకు ప్రాతినిథ్యం వహించిన సామ్ హారిసన్ పరుగుల వరద పారించాడు.

ప్రత్యర్థి బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన 39వ ఓవర్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్‌లు బాదాడు. ఈ ఓవర్‌లో నాథన్ బెన్నెట్ రెండు నో బాల్స్ వేయగా వాటిని కూడా సామ్ సిక్సర్లుగా మలిచాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 50 పరుగులు వచ్చాయి. మొత్తానికైతే ఎవ్వరికి సాధ్యంకాని రికార్డునే సాధించాడు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, క్రికెట్ చరిత్రలో రికార్డులు అనేవి ఎప్పటికైనా బ్రేక్ అవ్వాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed