67 ఏళ్ల వయసులో గేట్ క్లియర్ చేసిన గురూజీ

by Shyam |
67 ఏళ్ల వయసులో గేట్ క్లియర్ చేసిన గురూజీ
X

దిశ, ఫీచర్స్ : గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్ష అనగానే.. అమ్మో మన వల్ల కాదనే భావన చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కనిపిస్తుంది. ఇక కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్ స్టూడెంట్స్ అయితే ఆ వైపే చూడటం లేదు. ఇండియాలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో పీజీ చేయటానికే కాకుండా, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం కూడా గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. దాంతో జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు ఎంతో పోటీ ఉండగా.. ఓ వ్యక్తి 67 ఏళ్ల వయసులో గేట్ పరీక్ష పాసై, యంగ్ స్టూడెంట్స్‌కు స్ఫూర్తిగా నిలిచాడు.

తమిళనాడులోని హిందూ కళాశాలలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసిన శంకరనారాయణన్ శంకరపాండియన్‌కు రిటైర్మెంట్ తర్వాత మళ్లీ చదువుకోవాలనిపించింది. ఈ క్రమంలోనే గేట్ 2021 పరీక్షకు హాజరైన ఈ రిటైర్డ్ ప్రొఫెసర్.. గేట్ చరిత్రలో ఉత్తీర్ణత సాధించిన ఓల్డెస్ట్ పర్సన్‌గా చరిత్ర సృష్టించాడు. గణితం, కంప్యూటర్ పేపర్లను ఎంచుకున్న శంకర్.. అందులో వరుసగా 338, 482 మార్కులు స్కోర్ చేయడం విశేషం. ఇక శంకరనారాయణన్‌కు ఓ కుమారుడు(ఐఐఎం గ్రాడ్యుయేట్), యూఎస్‌లో స్థిరపడిన కుమార్తె, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు ఇంజనీరింగ్ పాఠాలు బోధించిన ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి అయినందున, ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి కార్పొరేట్ ఉద్యోగం చేయమని అతని ఫ్యామిలీ పట్టుబట్టేది. కానీ శంకర్‌ మాత్రం ఆకర్షణీయమైన ప్యాకేజ్, ధనార్జనే పరమావధిగా భావించలేదు. అతడి జీవితం ‘జ్ఞాన సంపాదనే’ లక్ష్యంగా సాగింది. ఇప్పుడు 67 ఏళ్ల వయసులోనూ అదే ఆశతో గేట్ పరీక్ష రాసిన శంకర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ రంగంలో పరిశోధన చేయాలనుకుంటున్నాడు.

‘పరీక్షలో ఫెయిల్ అయినా, మళ్ళీ ప్రయత్నించేవాణ్ణి. నేను వైఫల్యానికి భయపడను. పరిశోధనను కొనసాగించాలన్న లక్ష్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నేను మరింత తెలుసుకోవటానికి, మరింత జ్ఞానాన్ని పొందడానికి పరిశోధన చేయాలనుకుంటున్నాను. ఆ పరిశోధన వల్ల ఇతరులకు, సమాజానికి నా వంతు తోడ్పాటు అందించాలని అనుకుంటున్నా’ అని శంకర్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story