సీఎంకు లేఖ రాసిన వీఆర్ఏల సంఘం

by Shyam |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీపీఎస్సీ ద్వారా నియామకమై తొమ్మిదేండ్లయ్యింది. కొందరు ఏడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కానీ ఇప్పటికీ తమకు ఎలాంటి పదోన్నతులు లేవు. పే స్కేలు లేదు. చాలీచాలనీ జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. అప్పుల పాలై దీనస్థితిలో ఉన్నాం. తమను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్​శుక్రవారం లేఖ రాశారు.

2017లో ఒకసారి, 2020 సెప్టెంబర్ నెలలో మరోసారి గ్రామ రెవెన్యూ సహాయకుల కష్టాన్ని పనితనాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి, అర్హతల ప్రకారం పే స్కేలు ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా నేటికీ అమలు నోచుకోలేదన్నారు. ఎందుకు కాలయాపన జరుగుతుందో తెలియక, సీఎం హామీ ఎప్పుడు అమలవుతుందోనని, చదువుకున్న ఎంతో మంది వీఆర్ఏలు వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ఇది వరకు వీఆర్ఏల డ్యూటీ పార్ట్ టైం మాత్రమే ఉండేవి. అలాంటప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారం. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం రోజు ఏదో ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం వల్ల ఫుల్​టైం పని చేస్తున్నట్లు గుర్తు చేశారు.

వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినప్పటి నుండి గ్రామ స్థాయిలో ఉండే ప్రతి పని వీఆర్ఏ చేయాల్సి వస్తుందన్నారు. ఎన్నో మండలాల్లో జీతాలు సమయానికి రాని దుస్థితి ఉందన్నారు. వీఆర్ఏల ఉద్యోగం, వారి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ప్రమోషన్ ఉంటుందా ఉండదా అనేది తెలియడం లేదన్నారు. తమ కష్టాన్ని, పనితనాన్ని ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. వీఆర్ఏల గోసను ఆలకించి ఈ నెలలో ఏదో ఒకటి తేల్చి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story