- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 28వరకు అసెంబ్లీ సెషన్స్..
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలు ఖరారైంది. శనివారం, ఆదివారాలు (సెప్టెంబరు 12, 13, 20, 27) మినహా ఈ నెల 28వ తేదీ వరకూ కంటిన్యూగా 17 రోజుల పాటు సమావేశాలు జరిగేలా నిర్ణయం జరిగింది. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయం యథావిధిగా ఉంటుందిగానీ, ప్రజా సమస్యలపై చర్చించే జీరో అవర్ మాత్రం అరగంట కంటే ఎక్కువ ఉండదని ఈ సమావేశం నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయం కూడా గరిష్ఠంగా ఆరు ప్రశ్నలకే పరిమితమైంది. ఈ నెల 8వ తేదీన పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానంపై చర్చ, అనంతరం ఆమోదం తెలపడం, తదితర ప్రక్రియ ఉంటుంది. ఈ కారణంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండవు. 9వ తేదీన కరోనాపై ప్రభుత్వం చర్చను నిర్వహించనుంది. అదే రోజున కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. చర్చ మాత్రం 10, 11 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు జరగనుంది.
ప్రభుత్వం తరపున మొత్తం 16 అంశాలను సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి బీఏసీ సమావేశంలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత జీరో అవర్ ఉండనున్నాయి. టీ విరామం తర్వాత వివిధ అంశాలపై, తీర్మానాలపై, బిల్లులపై చర్చ జరుగుతుంది. బిల్లులను ప్రవేశపెట్టడం లేదా చర్చ జరపడం లాంటి సందర్భాల్లో అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు రోజుల పాటు శాసనసభ ప్రత్యేకంగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత రెండు మూడు గంటల పాటు అదనంగా చర్చించనుంది. అంశాల ప్రాధాన్యతను బట్టి శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కూడా వారి అభిప్రాయాన్నితెలియజేస్తే దానికి అనుగుణంగా సమావేశాలను మరికొన్ని రోజుల పాటు పొడిగించుకోవచ్చునని సూచించారు. చర్చలను దృష్టిలో పెట్టుకుని సభా సమయాన్ని కేటాయించడానికి సభ్యుల సంఖ్య, వారికి కేటాయించే సమయాన్ని నిర్ణయించాలని స్పీకర్‌కు సీఎం సూచించారు.
పీవీపై తీర్మానంతో మొదలు..
ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన నాలుగు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులతో పాటు కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారానికి సంబంధించిన తీర్మానాన్ని స్వయంగా సీఎం ప్రవేశపెట్టనున్నారు. దీనిపై విస్తృతమైన చర్చ జరిపి ఆమోదం పొంది ఈ ప్రతిని కేంద్రానికి పంపనుంది ప్రభుత్వం. అసెంబ్లీలో ఆయన చిత్రపటానికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్లమెంటులోనూ నిర్ణయం చేయాలని ఈ తీర్మానంలో ప్రభుత్వం పేర్కొననుంది. ఇక హైదరాబాద్‌లో ఆయన పేరుమీద స్మారక కేంద్రాన్ని నెలకొల్పడం, ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం తదితర అంశాలపై ఈ సందర్భంగా సీఎం సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు.
దీనికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల, వరదల కారణంగా జరిగిన పంట నష్టం, సత్వరం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యవసాయరంగంలో తెలంగాణ సొంతం చేసుకున్న విజయాలు, నియంత్రిత పంటల సాగు లక్ష్యాలు, రైతుల నుంచి వచ్చిన స్పందన, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలతోపాటు, పరిపాలనా సంస్కరణలు, పాలనా వికేంద్రీకరణ, స్థానిక సంస్థల విజయాలు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
తొలి రోజు సంతాప తీర్మానాలు..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహా మొత్తం 11 మందికి అసెంబ్లీ, నలుగురికి మండలి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించాయి. ప్రణబ్ ముఖర్జీ మృతికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రులు బలపరచగా వివిధ పార్టీల సభ్యులు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్రపై సభ్యులు ప్రధానంగా ప్రస్తావన చేశారు. దేశ రాజకీయాల్లో శిఖర సమానుడైన ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ రాష్ట్రంతో అనుబంధం ఉందని, ఆయన చేతుల మీదుగానే బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అపారమైన గౌరవం, విశ్వాసం కలిగిన ప్రణబ్ పొరపాటున ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పార్లమెంటు సాక్షిగా క్షమాపణ కోరేవారని, సైద్ధాంతికంగానే విభేదించేవారు తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారు కాదని సీఎం గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం..
బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా పరిస్థితులను సాకుగా చూపుతూ అసెంబ్లీలో మీడియా పాయింట్‌ని ఎత్తివేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వాన్ని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తగినంత మాట్లాడే స్వేచ్ఛ ఉండాలని, దానికి సరైన వేదిక మీడియా పాయింట్ అని వ్యాఖ్యానించారు. ప్రతీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలను గొంతు విప్పనీయకుండా ఎన్నిరోజులు అవసరమైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉందంటూ చెప్పడమే తప్ప దాన్ని ఆచరణలో పెట్టడం లేదని వ్యాఖ్యానించారు.
సభలో ఎలాగూ స్పీకర్ సహా అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను మాట్లాడనీయడం లేదని, కనీసం మీడియా పాయింట్ దగ్గరైనా ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాల్సి వస్తోందని, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకునే మీడియా పాయింట్‌ను ఎత్తేయాల్సి వచ్చిందని కేసీఆర్ వివరించారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా? అని భట్టిని ఉద్దేశించి ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో తగిన సమయం కేటాయింపు ఉంటుందని, ఆ ప్రకారం సభ్యులు నడుచుకోవాలని, ప్రజలకు సంబంధించిన సమస్యలను వినిపించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభా ముఖంగా తెలియజేసి తగిన తీరులో జవాబు చెప్తామన్నారు.