తెలంగాణకు వచ్చేస్తా.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-09-24 04:26:51.0  )
AP TDP leader JC Diwakar Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. అసెంబ్లీలో ఉన్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని సీఎం కేసీఆర్‌ను అభినందించారు. అదే సమయంలో తెలంగాణ వదిలి చాలా నష్టపోయామని జేసీ విలపించారు. కేసీఆర్‌ను సీఎం హోదాలో కలవలేదని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని జేసీ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని వివరించారు. రాయలసీమ వాసులైన తమను కలుపుకుని పోకపోవడం తప్పు అని సీఎంకి చెప్పినట్టు వెల్లడించారు. అయితే నాటి పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ముచ్చటించారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోతారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని అయితే ఆయనకు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఓటమి ఖరారైందని తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఇకపోతే హుజురాబాద్ ఉపఎన్నిక విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అంతగా భాగోలేదని విమర్శించారు. ప్రస్తుతం సమాజం సరిగ్గా లేదంటూ పెదవి విరిచారు. ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉందో పసిగట్టడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండేళ్లుగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాము త్వరలోనే తెలంగాణకు వచ్చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే తాము రాయలతెలంగాణ డిమాండ్ చేశామని..తమ ప్రతిపాదనను నాటి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed