కృష్ణా జలాలకు ఎసరు పెడుతున్న ఏపీ

by Anukaran |   ( Updated:2020-07-11 06:18:01.0  )
కృష్ణా జలాలకు ఎసరు పెడుతున్న ఏపీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ భారీ ప్రాజెక్టులకు రెడీ అవుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి జలాలను తరలించుకుపోయే ప్రాజెక్టులను రూపకల్పన చేస్తోంది. అనుమతులు తరువాయి… ముందుగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పోలవరం కుడికాల్వ సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోదావరి బోర్డుకు తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. గోదావరిలో మిగులు జలాల వాటా తేలడం లేదని, దీనిపై కేంద్రం పరిధిలో వాదనలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పనులు చేయకుండా అడ్డుకోవాలని కోరింది. ఓ వైపు కృష్ణా జలాల తరలింపులో భాగంగా పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతర తెలపడంతో జలవివాదాలు రాజుకున్నాయి. అటు ఏపీ ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. తాజాగా ఏపీ చేపడుతున్న భారీ నిర్మాణం చర్చనీయాంశమవుతోంది. దీనిపై గతనెలలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించడంతో పాటు త్వరలోనే టెండర్ల ఖరారుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

300 టీఎంసీల గోదావరి నీటి తరలింపు

పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. కాలువ సామర్థ్యం పెంపు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, పల్నాడుకు తరలించి సుభిక్షం చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ వెడల్పు 85.5 మీటర్లు కాగా లోతు 5మీటర్లు, ప్రవాహ సామర్థ్యం 17,633 క్యూసెక్కులు ఉంది. కాలువ పొడవు 174 కి.మీ. కాగా కుడి కాలువ కింద 3.2లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ ద్వారా కృష్ణాడెల్టాకు 80టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 2004లో గతంలో వైఎస్సార్‌ హయాంలో రూపకల్పన చేశారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచాలంటే కాలువను 181 మీటర్లు వెడల్పు చేయడంతో పాటు లోతును 6 మీటర్లకు పెంచాల్సి ఉంది. కాలువ కుడి వైపున 95.5మీటర్లు విస్తరించడం ద్వారా 181 మీటర్లకు వెడల్పు చేయనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు కొత్తగా 1,757 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. తాజాగా జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనకు సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీ ద్వారా తరలించే 50వేల క్యూసెక్కులను కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్‌ కుడికాలువ, పల్నాడు, వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక చేసుకున్నారు. మరోవైపు పోలవరం కుడివైపు నీళ్ల మళ్లింపునకు రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచేందుకు అన్నీ సిద్ధం చేశారు. 64, 65 ప్యాకేజీలుగా టన్నెల్‌ తవ్వకం పనులు నిర్దేశిత కొలతల ప్రకారం పూర్తయ్యాయి. గోదావరి నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు మళ్లించేలా ఈ టన్నెళ్లను ముందుగా డిజైన్‌ చేశారు. అయితే 50వేల క్యూసెక్కుల వరకు మళ్లించేందుకు అనువుగా సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి- బనకచర్ల (పెన్నా) అనుసంధానంలో భాగంగానే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గోదావరి వరద జలాలను కృష్ణా మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌ (పెన్నా)కు మళ్లించే ప్రతిపాదనపై వ్యాప్కోస్‌ అధ్యయనం పూర్తి చేసింది. ప్రస్తుతం 2టన్నెళ్లు 11.8 మీటర్ల డయా (వ్యాసార్థం)తో సిద్ధం చేశారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం 2 టన్నెళ్లు 17 మీటర్ల వ్యాసార్థంతో తవ్వేలా మార్పు చేసేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కొత్త కొలతల ప్రకారం టన్నెళ్లను సిద్ధం చేయాలంటే రూ.782 కోట్లు అవుతుందని అంచనా వేసి పెంచుతున్నారు.

గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండే పోలవరం దగ్గర 120 రోజుల పాటు 300 టీఎంసీలను తరలించే అవకాశాలు ఉండటంతో ఏపీ ఈ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా గోదావరి నీళ్లను నిల్వ చేసుకునేందుకు 200 టీఎంసీలతో ప్రకాశం జిల్లాలో భారీ రిజర్వాయరును నిర్మించాలని ఏపీ ప్రతిపాదనల్లో పేర్కొంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి రాయలసీమకు తరలించేందుకు బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రపురం సమీపంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేసి రోజుకు 2టీఎంసీలను సాగర్ కుడి కాల్వలోకి ఎత్తిపోయనున్నారు. కుడికాల్వ 81వ కిలోమీటరు సమీపంలో ఈ ఆయకట్టుకు నీటిని అందించి, ప్రకాశం జిల్లా బొల్లేపల్లి రిజర్వాయరుకు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా దిగువలోకి బనకచర్లకు తరలించే విధంగా ప్రతిపాదనలు చేశారు. మొత్తం పోలవరం నుంచి పెన్నా బేసిన్‌కు 560 కిలోమీటర్లు నీటిని తరలించనున్నారు. మొత్తం ఏడు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరలింపులో ప్రకాశం దగ్గర మినహాయిస్తే గోదావరి జలాలు కృష్ణాలో కలువకుండానే పెన్నాకు వెళ్తున్నాయి.

మొత్తం రూ. 80 వేల కోట్లు

ఏపీ ప్రభుత్వం దీనికోసం మొత్తం రూ. 80 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ పెంపునకు రూ. 12,700 కోట్లు అవసరమవుతాయని, ఇక్కడ నుంచి లైనింగ్, సామర్థ్యం పెంపునకు టన్నెల్స్, ఏడు చోట్ల లిప్టులు, భారీ రిజర్వాయరు నిర్మాణం కోసం మొత్తం రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతాయని ప్రతిపాదనల్లో వివరించారు.

రాయలసీమకు అడ్డులేదు

మరోవైపు కృష్ణాపై నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా ఉంది. ప్రధానంగా ఎన్జీటీ నుంచి నోటీసులు రావడంతో ఏపీ తరుపున అఫిడవిట్ దాఖలు చేసింది. పర్యావరణంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అటవీ ప్రాంతాలు ఉండవని, రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలనడం ఎన్జీటీకి సంబంధం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే రాయలసీమ, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు పనులను నిలిపివేయాలని బోర్డు కూడా లేఖ రాసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం ఎన్జీటీ నోటీసుల ఆధారంగానే పనులు టెండర్ల పనులను పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు చెప్పుతున్నారు. దీనికి తోడుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పనులకు కూడా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తోంది. తొలుతగా రూ. 6,500 కోట్లతో ఈ పనులు చేయనున్నారు.

ఇలా ఎగువ రాష్ట్రం ప్రయోజనాలు, అవసరాలను పట్టించుకోకుండా ఏపీ రెండు నదుల నీళ్లను దిగ్భంధనం చేసే ప్రాజెక్టులను నిర్మించనుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తున్నా అవి బోర్డులకే పరిమితమవుతున్నాయి. జల వివాదాలపై అపెక్స్ ఉంటుందని భావించినా కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కావడం లేదు. ఈలోగా ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, పనులను మొదలు పెట్టాలనే లక్ష్యంతో ఏపీ జలవనరుల శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed