అత్యవసరమా? ఏపీలో ప్రయాణించాలా?..ఇలా చేయండి

by srinivas |   ( Updated:2020-04-13 09:48:16.0  )
అత్యవసరమా? ఏపీలో ప్రయాణించాలా?..ఇలా చేయండి
X

కరోనా వైరస్ నియంత్రణకు తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. కనీస అవసరాలతో పాటు, అత్యవసర సేవలు పొందేందుకు కూడా వీల్లేకుండా చేసింది. త్వరలో లాక్‌డౌన్ సడలించే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ చేసిన ప్రకటన ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, నిరాశ్రయులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న వారు నియంత్రణ చర్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఊరట కలిగేలా కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ కార్యాలయం తెలిపింది.

పాసులు కావాలనుకునేవారు 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్‌ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్‌, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎందుకు? ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పిస్తే… ఆ పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారని వెల్లడించారు. అయితే తప్పుడు సమాచారం ఇచ్చినా, సహేతుకమైన కారణం లేకపోయినా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.

ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కావాలనుకునే ప్రజలు పైన తెలిపిన వివరాలతో ఏ జిల్లాకు చెందితే ఆ జిల్లా లేదా ఏ జిల్లాలో నివాసం ఉంటే ఆ జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి దరఖాస్తు చేసుకుంటే వారు అనుమతి పత్రాన్ని తిరిగి పంపిస్తారని డీజీపీ కార్యాలయం తెలిపింది. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవని డీజీపీ ఆఫీస్ స్పష్టం చేసింది. ప్రయాణ సమయంలో మీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపింది.

tags:ap dgp, dgp office, travel pass, vijayawada, andhra pradesh

Advertisement

Next Story

Most Viewed