ప్రైవేట్‌ ల్యాబ్‌లు పరీక్షలు చేయొచ్చు.. కానీ

by Anukaran |   ( Updated:2020-07-27 07:08:23.0  )
ప్రైవేట్‌ ల్యాబ్‌లు పరీక్షలు చేయొచ్చు.. కానీ
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

గత నెలలో ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించవచ్చంటూ ల్యాబ్‌లకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరలతో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టులకు ధరలు నిర్ణయించింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు నిర్వహించాలని చెబుతూ, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి 750 రూపాయలకి మించి వసూలు చేయొద్దని ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆదేశించింది.

ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే 2800 రూపాయలకు మించి వసూలు చేయడానికి లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రతి ల్యాబ్‌ పరీక్షల్లో ఐసీఎంఆర్‌ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్‌ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కరోనా వైరస్ పరీక్షల పేరిట వేలకు వేల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రులు గుంజుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనాకి వైద్యం అంటూ లక్షలకు లక్షల రూపాయలు గుంజుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని అడిగిన వారికి వైద్యం అందించకుండా వేధింపులకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదివరకే వైద్యానికి ధరలు నిర్ణయించిన ప్రభుత్వం, ఇప్పుడు పరీక్షలకు ధరలు నిర్ణయించింది. వీటిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed