అప్పు చేసైనా రైతులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం ధర్మాన

by srinivas |
అప్పు చేసైనా రైతులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం ధర్మాన
X

దిశ, ఏపీ బ్యూరో : వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 27 నెలల పాలనలో 14 నెలలు కరోనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. కరోనా విపత్కరపరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చతికిలపడిపోయిందని.. అయినప్పటికీ సీఎం జగన్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఆదాయం లేకపోయినా అప్పు చేసైనా రైతులను ఆదుకున్నారని.. అందుకు నిదర్శనమే రైతు భరోసా కింద రూ. 17,030 కోట్లు రైతులకు చెల్లించడం, పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా లాంటి కార్యక్రమాలను అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు.

వ్యవసాయం శుద్ధదండగ అన్న చంద్రబాబు నేడు రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో రైతులను విస్మరించి ఈ రోజు రైతు కోసం అంటూ రావడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ, 9 గంటల విద్యుత్ సరఫరా, 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని గతంలో రైతులకు మాయమాటలు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ రైతులు గుర్తుకు వచ్చారా అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed