నేషనల్ బటర్‌ఫ్లై రేసులో ‘ఏపీ సీతాకోకలు’

by Shyam |
నేషనల్ బటర్‌ఫ్లై రేసులో ‘ఏపీ సీతాకోకలు’
X

దిశ, వెబ్‌డెస్క్: రెయిన్‌బో రంగులన్నీ సీతాకోకచిలుక ఒంటిపై అందాలొలుకుతాయి. మకరందాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంగా విహరించే సీతాకోకల్ని చూస్తే.. మనసంతా ఏదో తెలియని సంబరం. ప్రకృతి అందానికి ఈ రంగుల కోకలు కట్టుకున్న సీతాకోకలే నిదర్శనం. మనచుట్టూ గింగిరాలు కొట్టే ఆ అందాల జీవుల్ని చూస్తే, చిన్ని పిల్లోడిలా వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. అందుకేనేమో అందాల పోటీలు.. మగువలకేనా? మాకెందుకు ఉండవు? అంటూ వయ్యారాలు పోతున్నాయి. ఆ మాటలు.. ఎవరి చెవిలోనో పడ్డట్టున్నాయి. ఈ క్రమంలోనే సీతాకోక చిలుకలకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకను ఎంపిక చేస్తున్నారు.

ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్‌ 8 వరకు కొనసాగే ఈ ఓటింగ్‌‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇప్పటికే 7 రకాల సీతాకోకచిలుకలు.. ఫైనల్ జాబితాకు ఎంపిక కాగా, వాటిలో పాపికొండలు వద్ద గల అభయారణ్యంలో సంచరించే కామన్‌ జేజేబెల్, కామన్‌ నవాబ్, ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే మూడు జాతుల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. తుది పోటీలో గెలిచిన సీతాకోకచిలుకను ‘జాతీయ ఉత్తమ సీతాకోకచిలుక’గా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటిస్తారు.

కాగా, ఫైనల్ లిస్టులో.. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రకాల సీతాకోక చిలుకలు ఉండగా.. వీటితో కృష్ణ పికాక్, ఫైవ్‌బార్ స్వార్డ్ టెయిల్, నార్తర్న్ జంగిల్ క్వీన్, ఎల్లో గోర్గాన్‌లు పోటీపడుతున్నాయి. అయితే, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలు.. తమ ‘స్టేట్ బటర్‌ప్లైస్’ను గతంలోనే ప్రకటించడం విశేషం. 2015లోనే మహారాష్ట్ర తమ రాష్ట్ర సీతాకోకచిలుకగా.. ‘బ్లూ మోర్మాన్’ బటర్‌ఫ్లైను డిక్లేర్ చేసింది. ఉత్తరాఖండ్ – ‘కామన్ పికాక్’, కర్ణాటక – ‘సౌతర్న్ బర్డ్ వింగ్స్’, కేరళ – ‘మలబార్ బండెడ్ పికాక్’, తమిళనాడు – ‘తమిళ్ యోమన్’ రకాలను తమ తమ రాష్ట్ర సీతాకోకచిలుకలుగా ప్రకటించుకున్నాయి.

‘సీతాకోకచిలుక’లను బెస్ట్ పాలినేటర్స్‌కు ఉదాహరణగా చెప్పొచ్చు. వీటి మనుగడ వల్ల పర్యావరణ వ్యవస్థ బాగుంటుంది. ఇవి లేకుంటే.. పండ్లు, పూలు, కూరగాయలతో పాటు చాలా రకాల పంటలు మొలకెత్తవంటే అతిశయోక్తి కాదేమో. అందుకే వాటిని ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు సంకేతంగా చెబుతారు. ఏదైనా ప్రాంతంలో సీతాకోకచిలుకలు కనిపించకపోతే.. ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదంలో ఉందనే అర్థం.

Advertisement

Next Story

Most Viewed