హుజూరాబాద్‌కు మరో నామినేటెడ్ పదవి.. ఆర్టీసీ చైర్మన్‌గా ఆయన పేరు డిక్లేర్?

by Anukaran |   ( Updated:2021-08-25 22:13:04.0  )
KCr
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నేతలకు నామినేటెడ్, పార్టీ పదవులు వరిస్తున్నాయి. ఇప్పటికే ఎస్సీ, బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్.. మాజీమంత్రి పెద్దిరెడ్డికి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్​ టాపిక్​గా మారింది. హుజురాబాద్​ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఇప్పుడు హుజురాబాద్​ మారింది. పెద్దిరెడ్డికి అవకాశం వస్తే ఒకేసారి నాలుగు నామినేటెడ్ పదవులు వచ్చిన నియోజకవర్గంగా చరిత్రకెక్కనుంది.

నియోజకవర్గంలో త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యంగా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు, పార్టీ నేతలు గల్లీ గల్లీనా ప్రచారం చేస్తున్నారు. నిధుల వరద పారిస్తున్నారు. ఈటల వెంట ఉన్న నేతలకు గాలం వేస్తున్నారు. ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్​రావు రాజకీయ సమీకరణలు చేస్తున్నారు. మరోవైపు దళితబంధుకు పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే రూ.1200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

పుష్కలంగా నిధులు… పదవులు

ఎన్నికల పుణ్యమా అని దారాళంగా నిధులతో పాటు నామినేటెడ్ పదవులు సైతం హుజురాబాద్​ సెగ్మెంట్‌ను వరిస్తున్నాయి. కులాల ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా పథకాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బండా శ్రీనివాస్‌కు, బీసీ కులానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా మంత్రి వర్గం తీర్మాణం చేసి గవర్నర్‌కు పంపారు. యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించారు. దళితబంధుతో అక్కడ 22 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందించేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. అయినా దళితులు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేకపోవడంతో వారందరిని తమవైపునకు తిప్పుకుని ఓట్లు గంపగుత్తుగా పడేలా సర్వశక్తులు ఒడ్డుతోంది.

దీనిలో భాగంగా అన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేలా వర్గానికో నామినేటెడ్ పదవి అన్నట్లు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు అప్పగించినా, అధిక నిధులు కేటాయించినా నియోజకవర్గ ప్రజల నుంచి ఆశించిన మేర సానుకూలత రావడం లేదని సీఎం కేసీఆర్​ గుర్తించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెగ్మెంట్‌కు చెందిన మరో నేతకు ఇంకో నామినేటెడ్ పదవి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో గులాబీ కండువా కప్పుకున్న సందర్భంగా నామినేటెడ్​ పదవి ఇస్తామంటూ సీఎం హామీ ఇచ్చారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం. ఇప్పుడు ఈ చర్చ అధికార పార్టీలో తీవ్రమైంది. ఒకవేళ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగిస్తే నియోజకవర్గానికి నాల్గో పదవి వచ్చినట్లు అవుతుంది. ఒకే నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చిన హుజూరాబాద్ చరిత్రలో నిలువనుంది.

Advertisement

Next Story

Most Viewed