కర్కశత్వానికి ముగింపు.. కుదురు పెకలింపే..

by Shyam |   ( Updated:2020-03-18 09:03:20.0  )
కర్కశత్వానికి ముగింపు.. కుదురు పెకలింపే..
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల కిందట తొమ్మిదినెలల పసిగుడ్డుపై అఘాయిత్యం జరిగినప్పుడు నిందితుడిని నడిరోడ్డుపై బహిరంగంగా ఉరి‌తీయాలని సభ్యసమాజం నినదించింది. సామాన్యులు, పౌరసమాజం పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు దిశ ఘటన జరిగింది. అప్పుడూ ఇలాంటి డిమాండ్లే వచ్చాయి. అయితే, పోలీసులు అనూహ్యంగా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. మంగళవారం(ఈ నెల 17న) చటాన్‌పల్లి వద్ద జరిగినట్టే మరో ‘దిశ’ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లి శివారులో వంతెన కింద గుర్తు తెలియని మహిళ(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ శరీరంపై దస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

నాగరిక సమాజ పయనమెటు..

అభివృద్ధి పాలకుల నోటి నుంచి ఎప్పుడూ వినబడే మాట ఇది. గెలుపోటములకు, పార్టీ ఫిరాయింపులకు, సెంటిమెంటులకు కేంద్రంంగా ఈ మాట ఉంటది. ఇంత అభివృద్ధి, టెక్నాలజీ, రోడ్లు, రైళ్లు, సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు చెలరేగుతుండటానికి కారణాలేమిటి? ‘నిర్భయ’, ‘హన్మకొండలో చిన్నారిపై అమానుషం’, ‘దిశ’,‘సమత’ వంటి ఘటనలు జరిగినప్పుడు ఛీ..ఛీ..నాగరకి సమాజం ఎటుపోతోంది అని ప్రతి ఒక్కరిలో మధనం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికలవుతాయి. తర్వాత మెల్లిమెల్లిగా కనుమరుగవుతాయి. అయితే, సమాజంలో ఇటువంటి ఘటనలకు సిద్ధమయ్యే కొంత మందిలో పైశాచికత్వం, కర్కశత్వం పెరుగుతుండటం ఆ తర్వాత చర్యలకు బాధ్యులెవరు? నేరప్రవృత్తికి మూలాలెక్కడున్నాయి? అసలు సమాజపు అసంబద్ధ పోకడాలకు కారణాలపై సైకాలజిస్టులు, శాస్త్రీయ నిపుణులు అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే, వనితల భద్రత కోసం హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ అనే కొత్త ఒరవడికి నాడే శ్రీకారం చుట్టారు. కానీ, ఇవేవీ మహిళలపై నేరాలను సంపూర్ణంగా అరికట్టడానికి దోహదపడడంలేదని ‘దిశ’ ఉదంతం తేటతెల్లం చేసింది. సమాజపు పోకడలు ఎలా ఉన్నాయంటే.. నేరం ఫోకస్ అయినంత శిక్ష ఫోకస్ కావడం లేదు. అయితే, ఇందుకు న్యాయవ్యవస్థ లోపాలున్నాయి అని వాదనలు చేసేవారూ ఉన్నారు. అది నిజమే కావొచ్చు. కాని న్యాయం జరిగినట్టే కాదు నిరూపితమైనట్టు కనిపించాలన్న న్యాయసూత్రాన్ని పాటించాలి. కొనసాగింపుగానే..‘‘జస్టిస్ డిలేయిడ్ ఈజ్ డినేయిడ్’’(న్యాయం ఆలస్యమైతే జరగనట్టే)నన్న సూత్రం కూడా గుర్తెరగాలి. సత్వర న్యాయం దిశగా శాసనాలు రూపొందించాలి.

పరివర్తనతోనే ప్రవృత్తి మార్పు

ఇప్పటికే ఉన్న పలువిశ్లేషణల ప్రకారం..నేరప్రవృత్తికి ప్రధాన కారణం మద్యపానమేనని తెలుస్తోంది. ప్రభుత్వాలకు ఇప్పుడు బడ్జెట్‌లో సింహభాగం మద్యం నుంచే వస్తోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం.. మద్యపానం, ఇతర వ్యసనాల నుంచి సమాజాన్ని దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది బహిరంగ సత్యం. అయితే, ఇప్పుడున్న ప్రభుత్వాల ప్రాధాన్యత ప్రకారమైన బాధ్యతాయుతమైన మద్యపాన విధానం ఉంటే అన్న బాగుంటుందన్న ఆలోచనైనా పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.

చట్టాలే సరిపోవు..

చట్టం వచ్చినంత మాత్రాన నేరాలు తగ్గుతాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. ఇప్పటికే.. నిర్భయ, ఆ తర్వాత దిశ చట్టం వచ్చింది. కానీ, అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో దిశ ఉసురుపోతే.. ఏపీలో దిశ చట్టం పురుడుపోసుకుంది. అయినా ఏం మారింది.. అత్యాచారాలు ఏపీలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. మార్పు జరగాల్సింది ఎక్కడా? అసలు జరుగుతోంది ఎక్కడ? నేటి సమాజంలో బాధ్యతాయుతమైన విధులు పౌరులు నిర్వర్తించకపోయినా పరవాలేదు. కానీ, హాని చేకూరకుంటే చాలు అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే.. సమాజం మార్కెటీకరణ, ప్రపంచీకరణ యుగంలో ఉన్నది. పెట్టుబడిదారీ సమాజం వేళ్లూనుకున్నది. మహిళను అంగడి సరుకుగా చిత్రీకరించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నవి. నాటి నుంచి నేటి వరకూ చిత్రాల్లో హీరోలు హీరోయిన్లను ఏడ్పించే సందర్భాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటివి ప్రభావితం చేయవా?అంటే తప్పక చేస్తాయని అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే పురుషాధిక్య భావజాలం, పితృస్వామ్య వ్యవస్థ కుదుర్లు నేటికీ బలంగా ఉన్నాయి. ఈ సందర్భాన మహిళపట్ల భక్తి, ఆరాధన కలిగే అవకాశాలు తక్కువే కదా.. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకు ఓ పదేండ్ల బాలుడు సినిమాల్లో హీరోయిన్‌ను టీజ్ చేసే సందర్భాలు చూస్తూనే పెరుగుతుంటాడు. పైగా కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి సమాజంలో మహిళల ప్రాధాన్యత ఎలా తెలుస్తుంది.. కాబట్టి మార్పు దిశగా కదలాలంటే.. మొదలు కుటుంబం నుంచి మొదలు కావాలి.. మార్పు అనివార్యమైనపుడు కొనకొమ్మలకు మందేస్తే సరిపోదు చెదలు పట్టిన కుదుళ్లతో సహా పెకలించాలి అన్నట్టుగా.. సమాజ మొదటి అంగం కుటుంబవ్యవస్థ నుంచి మార్పు ఆరంభమవాలి. ప్రపంచానకే వసుధైక కుటుంబం గురించి, సర్వధర్మ సమభావన గురించి నేర్పించిన భారతవనిలో నేడు కుటుంబ వ్యవస్థ కుదర్లు బలపడాల్సిన అవసరముంది. పరాయి స్త్రీలో అమ్మను చూడగల సమాజం రూపొందాలంటే దానికి బీజం కుటుంబం(కుటుంబవ్యవస్థ) నుంచే పడాలి.

Tags : another disha incident, women safety, she teams

Advertisement

Next Story

Most Viewed