Heavy Rains: కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. వర్షపాతం ఇదే..!

by srinivas |
Heavy Rains: కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. వర్షపాతం ఇదే..!
X

దిశ, కడప ప్రతినిధి: కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఒక్కసారిగా దంచి కొట్టాయి. దీంతో జిల్లాలోని ముద్దనూరు, మైలవరం మండలం మినహా అన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. కడప రెవెన్యూ డివిజన్‌లో చెన్నూరులో 168.8 ఎం.ఎం, కడపలో 98.2 ఎం.ఎం, వల్లూరులో 80.4 ఎం.ఎం, పెండ్లిమర్రి మండలంలో 83.4 ఎం.ఎం, సిద్దవటంలో 160.8 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. అలాగే బద్వేలు రెవిన్యూ డివిజన్‌లో బ్రహ్మంగారిమఠంలో 43.8 ఎం.ఎం, బి కోడూరులో 32.2 ఎం.ఎం, మైదుకూరులో 40.0 ఎం.ఎం, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్‌ దువ్వూరులో 29.08 ఎం.ఎం, పులివెందుల రెవిన్యూ డివిజన్‌ వేంపల్లెలో 50.6 ఎం.ఎం, చక్రాయపేటలో 73.0 ఎం.ఎం, లింగాలలో 59.2 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1340.4 ఎం.ఎం వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం 37.02 ఎం.ఎం నమోదైంది. జిల్లాలో చెన్నూరు మండలంలో అత్యధికంగా 168.8 ఎం.ఎం వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ కొండాపురంలో 0.4 ఎం. ఎం వర్షపాతం నమోదైంది. జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో కుందూ, పెన్నా నదులతో పాటు వాగులు, వంకలు భారీగా ప్రవహించాయి. ఖాజీపేట - రావులపల్లె మధ్య వున్న వక్కిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే కడపలో పలు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed