వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నారు: అచ్చెన్నాయుడు

by Mahesh |   ( Updated:2023-04-01 09:51:27.0  )
వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నారు: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అండదండలతో రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయటం దుర్మార్గపు చర్య అని అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి అక్రమ భూదందాలకు పాల్పడుతున్నారని.. బిల్డర్లను బెదిరించి శ్రీధర్ రెడ్డి డబ్బులు వసూలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే వారి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరి దగ్గర శ్రీధర్ రెడ్డి కమీషన్లు వసూలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పల్లె రఘునాధ్ రెడ్డి విసిరిన సవాల్‌కి పరారయ్యారని ఎద్దేవా చేశారు. ప్రమాణం చేయడానికి రాకుండా పిరికిపందలా పారిపోయిన శ్రీధర్ రెడ్డి వైసీపీ గూండాల చేత టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలు పూటుగా మద్యం తాగి టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. దాడి చేసిన వైసీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నా: చంద్రబాబు నాయుడు


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story