సాగర తీరంలో వేడెక్కిన రాజకీయం.. కూటమి వర్సెస్ వైసీపీ

by Geesa Chandu |
సాగర తీరంలో వేడెక్కిన రాజకీయం.. కూటమి వర్సెస్ వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఒక వైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. మరో వైపు స్టాండింగ్ కమిటీ ఎన్నిక. మొత్తానికి విశాఖ సాగర తీరం కేంద్రంగా ఏపీ రాజకీయం వేడిక్కింది. పక్కా మాదే గెలుపనే ధీమాలో వైసీపీ ఉంటే.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యం తో కూటమి పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా అని టీడీపీ, తన బలాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే తపనతో వైసీపీ పోటాపోటీగా తమ సాధ్యాసాధ్యాలను లెక్కగడుతున్నాయి.

సాగర తీరం వేడెక్కింది..

విశాఖలో రాజకీయ వాతావరణంతో.. ఇప్పుడు మొత్తం ఏపీనే వేడెక్కింది. అటు GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు.. అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా ఈ రెండు ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో క్యాంప్‌ రాజకీయాలు మొదలుపెట్టాయి. 97 మంది కార్పోరేటర్లు ఉన్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున, మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. బుధవారం జరిగే ఈ ఎన్నికలో క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఇరువురు పార్టీల నేతలు వ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. తాజాగా విశాఖకు చెందిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. దీంతో GVMC స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. అయితే.. బలం లేకపోయినా అక్రమంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

మరో వైపు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్ధిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. ఆయన ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత కావడం తో పాటూ స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతోనే.. వైసీపీ పార్టీ బొత్స వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సంఖ్యాపరంగా చూసినా కూడా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ కంటే మూడు రెట్ల బలం ఉంది. కానీ ప్రస్తుతం కూటమి నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టారు. కొంత మంది వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో సమావేశం అయినట్టు తెలుస్తోంది. వారితో పాటూ మరి కొంతమందిని కూడా తమతో టచ్ లోకి తెచ్చుకునే ప్రయత్నంలో కూటమి నేతలు ఉన్నారు. దీంతో వైసీపీ సైతం అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. ఓటు హక్కున్న సభ్యులతో వైసీపీ అధినేత జగన్ బుధవారం సమావేశం కానున్నారు. ఇంకా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో ఇప్పటికే బొత్స భేటీ అయ్యారు. బలం లేకపోయినప్పటికీ డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని.. బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు.



Next Story

Most Viewed