98 శాతం హామీలు నెరవేర్చామంటున్న సీఎం.. అంత సీన్ లేదంటున్న విపక్షాలు

by Hamsa |   ( Updated:2023-10-12 06:01:52.0  )
98 శాతం హామీలు  నెరవేర్చామంటున్న సీఎం.. అంత సీన్ లేదంటున్న విపక్షాలు
X

‘దేశంలోనే మరే రాష్ట్రంలో లేనట్లు మన ప్రభుత్వం 98 శాతం హామీలను నెరవేర్చింది. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్పండి..’ అని సీఎం జగన్​ వైసీపీ శ్రేణులకు నిర్దేశించారు. దీన్నిబట్టి ఇంకా అమలు కావాల్సిన హామీలు కేవలం రెండు శాతమే. విపక్షాలు దీన్ని ఎంత మాత్రం అంగీకరించడం లేదు. కొన్ని హామీలను రివర్స్ లో అమలు చేశారని విమర్శలు సంధిస్తున్నాయి. కేంద్రం నుంచి సాధిస్తామన్న ప్రధాన హామీలను విస్మరించినట్లు పేర్కొంటున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్​ ఇచ్చిన హామీల్లో నెరవేరని వాటి గురించి విపక్ష నేతలు నిలదీస్తున్నారు. వీటిపై అటు ప్రభుత్వం.. ఇటు వైసీపీ శ్రేణుల నుంచి సమాధానం లేదు.

దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికల ముందు వైసీపీని 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ పదే పదే ప్రకటించారు. విభజన హామీలను అన్నింటినీ నెరవేర్చేట్లు పోరాడతామన్నారు. కడప ఉక్కు గిట్టుబాటు కాదని కేంద్రం జారుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. రామాయపట్నం మేజరు పోర్టును కేంద్రం నిర్మించాలి. ఇక్కడ కూడా అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇబ్బంది లేకుండా రామాయపట్నాన్ని మినీ పోర్టుగా మార్చేశారు. విశాఖ రైల్వే జోన్​, విశాఖ– కాకినాడ పెట్రో కారిడార్​, రైల్వే జోన్​ సాకారం కాలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన హామీల్లో ఉంటే దానికి సక్రమంగా నిధులు ఇవ్వకున్నా కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని దైన్యంలోకి జారిపోయారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు పూర్తి మెజారిటీ వచ్చినందున మెడలు వంచడం సాధ్యం కాలేదని అధికార పార్టీ నేతలు బుకాయిస్తున్నారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను కోల్డ్ స్టోరేజీలో పెట్టించేందుకు కేంద్రం ముందు సాగిలపడుతున్నారని విపక్షాలు నిందిస్తున్నాయి.

ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రధాన హామీల్లో నెరవేరనివి ఇవే..

– అధికారానికి వచ్చిన వారంలో ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. దాని బదులు జీపీఎస్​ తీసుకొచ్చారు.

– కాంట్రాక్టు, అవుట్​ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేస్తామన్నారు. దీనికి అనేక కొర్రీలు వేసి మమ అనిపించారు.

– వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు ప్రతీ ఏటా జాబ్​ క్యాలెండర్​ తో భర్తీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు ఒకటి రెండు శాఖల్లో మాత్రమే నియామకాలు చేపట్టారు.

– దశలవారీ మద్య నిషేధమన్నారు. దీన్ని పూర్తిగా అటకెక్కించారు. ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. దశాబ్దాల తరబడి పేరొందిన బ్రాండ్ల స్థానంలో ఊరూపేరూ తెలియని బ్రాండ్లను అంటగడుతున్నారు.

– అల్ప సంఖ్యాక బీసీలకు మండలిలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. నామినేటెడ్​ పనుల్లో సగం బీసీఎస్సీఎస్టీ మైనార్టీలకు ఇస్తామన్నారు. వీటి గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు.

– కౌలు రైతులకు మెరుగైన చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ సున్నా వడ్డీకి పంట రుణాలు, నష్ట పరిహారం అందిస్తామన్నారు. పంట ఉత్పత్తుల ధరలు ముందుగా ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆచరణలో ఒక అడుగు ముందుకు పడితే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి.

పూర్తికాని సాగు నీటి ప్రాజెక్టులు..

– నాలుగున్నరేళ్ల పాలనలో పెండింగు ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాలేదు. ఓ పది కోట్లు వెచ్చించడం వల్ల సంగం బ్యారేజీ ఒక్కటే గట్టెక్కింది.

– రాయలసీమలోని ఆర్డీఎస్​ కుడి కాలువ, వేదవతి ఎత్తి పోతల పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి.

– హంద్రీ నీవా సగం సామర్థ్యం మేరకు కూడా నీటిని అందించలేకపోతోంది.

– రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్​ శంకుస్థాపనకే పరిమితమైంది.

– సిద్దేశ్వరం అలుగు సంగతినే మరిచారు.

– రాయలసీమ ఎత్తిపోతల పనులు సగమే పూర్తయ్యాయి.

– అధికారానికి వచ్చిన ఏడాదిలోపే కృష్ణా జలాలు ఇస్తామన్న ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు.

– ఇంకా ఉత్తరాంధ్రలో తోటపల్లి బ్యారేజీతో సహా పలు సాగు నీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ పూర్తి చేయలేకపోయారు.

రివర్స్​లో అమలు చేస్తున్నవి..

– వైసీపీ అధికారానికి రాగానే కరెంటు, రవాణా చార్జీలు తగ్గిస్తామన్నారు. కరెంటు చార్జీలు ప్రతినెలా పెంచుకుంటూపోతున్నారు.

– పెట్రోలు, డీజిల్​ ధరలపై నాడు టీడీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు పొరుగునున్న కర్నాటక కన్నా లీటరు రూ. 9 ఎక్కువ ధరకు ఇక్కడ అమ్ముతున్నారు.

– నాడు నిత్యావసరాల ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు సగానికి సగం ధరలు పెరిగాయి.

– వాహనాలకు జీవిత పన్ను, రోడ్డు సెస్​లు బాదేస్తున్నా గుంతల రోడ్ల నుంచి ఉపశమనం కల్పించలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed