నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత: ఏపీ పోలీసులపై కేసు నమోదు

by Seetharam |   ( Updated:2023-12-01 07:22:19.0  )
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత: ఏపీ పోలీసులపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా డ్యాంపైకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అనుమతి లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు కుడి కాలువ నుంచి నీటిని వదిలారని తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఐజీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఇకపోతే నాగార్జునసాగర్ దగ్గర హైటెన్షన్ కొనసాగుతుంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీస్ పహారా కొనసాగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్‍మెంట్ బోర్డు నిబంధనలను ఏపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని తెలంగాణ ఆరోపిస్తోంది.


యుద్ధవాతావరణం

ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం పోలీసులతో మోహరించిది. దీంతో డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేరుకున్నారు. ఐజీస్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఏపీకి నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతుందని తెలుస్తోంది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో సాగర్ జలాల వివాదం తెరపైకి వచ్చినట్లైంది. దీంతో సాగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డ్యాంపై 1500 మంది ఏపీ పోలీసుల మకాం వేశారు. అటు తెలంగాణకు సంబంధించిన వెయ్యి మంది పోలీసులు మోహరించారు. దీంతో సాగర్ డ్యాం వద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇకపోతే ఏపీ ప్రభుత్వం సాగర్ జలాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.




Advertisement

Next Story

Most Viewed