సంగమేశ్వరా క్షమించు !

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 04:05:40.0  )
సంగమేశ్వరా క్షమించు !
X

దిశ, కర్నూలు ప్రతినిధి : నల్లమల అభయారణ్య ప్రాంతాల్లో వెలసిన శైవ క్షేత్రాల్లో సంగమేశ్వర క్షేత్రం ఒకటి. అత్యంత ప్రాచీన చిరిత్ర, ఎందరో మునులకు ఆశ్రయమిచ్చిన క్షేత్రం నేడు పాలకులు, అధికారుల తీరుతో ప్రాశస్త్యం కోల్పోతుంది. శ్రీశైలం వెనుక జలాల్లో మునకకు గురైన ఆలయం 23 ఏళ్ల తర్వాత 2003 నుంచి కృష్ణమ్మ గర్భం నుంచి బయటపడి భక్తులతో పూజలందుకుంటూ వస్తోంది.

అప్పటి నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతోన్న తరుణంలో అధికారులు, పాలకులు కారణంగా మళ్లీ తన ప్రాశస్త్యాన్ని కోల్పోయే స్థితికొచ్చింది. రెండ్రోజుల్లో శివారాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటికీ అక్కడ సౌకర్యాలు కల్పించకపోవడం, ప్రభుత్వం కూడా నిధులు కేటాయించకపోవడంతో ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో చేపట్టలేదు. కృష్ణా పుష్కరాల్లో ఉమ్మడి జిల్లాల్లో శ్రీశైలం తర్వాత సంగమేశ్వరం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎలా చేరుకోవాలి

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్లవచ్చు.

కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే సంగమేశ్వరానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. ఆత్మకూరు నుంచి ఆటోల ద్వారా కూడా వెళ్లవచ్చు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం బోట్లను అధికారులు నిషేధించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోని కృష్ణానదిని ఘాట్ బోట్ల ద్వారా దాటించే వారు. కొందరు దళారుల పుణ్యమాని దాదాపు నెల రోజులుగా ఘాట్ బోట్ల రవాణాను జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి నిలిపేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి ఘాట్ బోట్లు నది దాటే ప్రయత్నం చేయలేదు. దీంతో తెలంగాణకు వెళ్లే వారు, ఆంధ్రకు వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

శివరాత్రి కావడంతో వేల సంఖ్యలో భక్తులు సంగమేశ్వరుడిని దర్శించుకునే వారు. కానీ దళారుల కారణంగా ఈ సారి తెలంగాణకు చెందిన భక్తుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఫలితంగా సంగమేశ్వరం, సిద్దేశ్వరం ఘాట్ బోట్ల నిర్వాహకులకు భారీగా నష్టం వాటిల్లనుంది. బోట్లపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాధారంగా ఉన్నాయి. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి రాకపోకలకు అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : Stambheshwar Mahadev Temple : ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివాలయం ఇదే !

Advertisement

Next Story

Most Viewed