Shivaratri special: ఇక్కడ కాకులు వాలవు.. కల్యాణాలు జరగవు.. ఈ త్రికూటాద్రి (Kotappakonda) మహిమాన్వితం

by Anil Sikha |
Shivaratri special: ఇక్కడ కాకులు వాలవు.. కల్యాణాలు జరగవు..   ఈ త్రికూటాద్రి (Kotappakonda) మహిమాన్వితం
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: మీరు వింటున్నది నిజమే.. ఈ కొండపై కాకులు వాలవు.. ఈ పుణ్యక్షేత్రంపై ఆ పక్షులు అసలు కనిపించవు. ఇది ఎక్కడ ఉందో తెలుసా.. ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది గాంచిన కోటప్పకొండ (Kotappakonda) ఇది. శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధిలో కల్యాణాలు కూడా జరగవు. ఇక్కడ కాకులు వాలకపోవడానికి గల చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పాలంటే..కోటప్పకొండపై ఉన్న ఆ పరమ శివుడికి ఓ గొల్లభామ రోజూ పెరుగన్నం తీసుకు వెళుతుండేది. ఓ రోజు పెరుగన్నం తీసుకు వెళుతుండగా కాకుల గుంపు రావడంతో ఆమె కంగారు పడింది. దీంతో పెరుగన్నం కుండ కిందపడి పగిలిపోయింది.దీంతో తన శివయ్యకు అన్నం తీసుకు వెళ్లలేకపోయానే అని ఆమె వేదన చెందింది. అప్పుడు ఆ పరమశివుడు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కొండ దిగి ఆమె వద్దకు వచ్చాడు. ఇక ఆ కొండపై కాకి వాలబోదంటూ ఆమెకు అభయమిచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కొండపై ఒక్క కాకి కూడా వాలలేదని భక్తులు చెబుతారు. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా ఈ శిఖరంపై వెలిశాడు. కాబట్టి ఇక్కడ కల్యాణాలకు కూడా జరగవని పెద్దలు చెబుతారు. అలాగే దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్షు కలుగుతుందని ప్రతీతి.

కోటప్పకొండ పల్నాడు (palnadu) జిల్లా కేంద్రం నరసరావుపేట (narasaraopet)కు సమీపంలో ఉంటుంది. ఈ కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీనికి త్రికూటాద్రి అనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా చెబుతారు. ఇక్కడ బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుంచి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడిని పాత కోటప్ప గుడి అంటారు. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అంటారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరానికి నైరుతి భాగాన ఉన్న శిఖరాన్ని బ్రహ్మ శిఖరం అంటారు. దిగువన ఉన్న పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు.

ఏటా శివరాత్రి నాడు కోటప్పకొండపై ఉత్సవాలు నిర్వహిస్తన్నారు. ఇందుకోసం త్రికూటేశ్వర స్వామి సన్నిధిని సుందరంగా తీర్చిదిద్దుతారు. పండుగనాడు మహిళలు పొంగళ్ళు చేసి, మెట్ల పూజ చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే మొక్కులు చెల్లించుకునేందుకు బాల ప్రభలు, చిన్న ప్రభలతో తరలివస్తారు. రాత్రికి రంగు రంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో కోటప్పకొండ పుణ్య క్షేత్రం వెలిగి పోతుంది. శివరాత్రి సందర్భంగా కొండ పైన ఉన్న ప్రధాన ఆలయం తో పాటు, నాగేంద్రుని పుట్ట, త్రిముఖ శివలింగం ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, బొచ్చుకోటయ్య స్వామి సన్నిధి, కొండ పై భాగం విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు.

Advertisement
Next Story

Most Viewed