వైఎస్‌ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడు?.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-04-10 06:16:37.0  )
వైఎస్‌ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడు?.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకే అన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ అని విమర్శించారు. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఎద్దేవా చేశారు. ముస్లింలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని విమర్శించారు. బీజేపీకి కట్టు బానిస అయిన జగన్.. వైఎస్సార్‌కు వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడు.. ఇమామ్‌లకు రూ.15 వేల వేతనం, ముస్లిం బ్యాంకు, చనిపోతే రూ.5 లక్షల బీమా అంటూ ఇలా అనేక హామీలు ఇచ్చి విస్మరించాడని గుర్తుచేశారు. ఎప్పటికైనా ముస్లింల పక్షాన నిలిచేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జగనే కాదు.. చంద్రబాబు కూడా ముస్లింలకు న్యాయం చేయలేదని.. ఏనాడూ ముస్లింల కోసం ఆలోచించలేదని మండిపడ్డారు.

వీళ్లంతా బీజేపీకి బానిసలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు నెరవేర్చని, హోదాపై స్పందించని బీజేపీ వెంట వీళ్లేందుకు నడుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని అన్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని మండిపడ్డారు. CBI నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసింది.. అలాంటి అవినాష్ రెడ్డి మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహించి నిజాలు దాస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు? అని అడిగారు. CBI నిందితుడు అని చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే తాను పోటీ చేస్తున్నా.. కడప ప్రజలకు అందుబాటులో ఉంటా.. వైఎస్సార్ లెక్క సేవ చేస్తా అని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed