Sharmila : హోదా కోసం గళమెత్తండి : చంద్రబాబుకు షర్మిల డిమాండ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-31 10:33:08.0  )
Sharmila : హోదా కోసం గళమెత్తండి : చంద్రబాబుకు షర్మిల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రత్యేక హోదా(Special Status)తోనే రాష్ట్రంలో సంపద సృష్టి సాధ్యమని.. కేంద్ర ప్రభుత్వం మనుగడలో పెద్ధన్న పాత్ర పోషిస్తున్నందునా ఈసారైనా మీరు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం గళమెత్తాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(AP Congress Chief YS Sharmila) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu)ను డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ కమిటీ తరుపునా బహిరంగ లేఖ(Open letter)రాశారు.

కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని చంద్రబాబును లేఖలో షర్మిల ప్రశ్నించారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ ఎంపీలు తమ గళం విప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోడీని నిలదీయాలన్నారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల లేఖలో పేర్కొన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నామన్నారు.

వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే ఎంతగా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబుకు చెప్పా్ల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని గతంలో 2014లో ఎన్డీఏతో కలిసి, కేంద్రంలో పదవులు అనుభవించారని, తర్వాతా హోదా ఏమైనా సంజీవనియా అని యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబుకు గుర్తు చేశారు. మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టి కేంద్రంలో పదవులు అనుభవిస్తున్నారని..ఈదఫానైనా విభజన హామీల అమలు కోసం, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

Next Story

Most Viewed