ఆ రోజే కొత్త జిల్లాల ప్రారంభం.. వేగం పెంచిన జగన్ సర్కార్

by Rajesh |
ఆ రోజే కొత్త జిల్లాల ప్రారంభం.. వేగం పెంచిన జగన్ సర్కార్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వేగం పెంచింది. తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నెలాఖరున నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న ఉగాది రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఒక కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 26 జిల్లాలకు సంబంధించి అన్ని కార్యాలయాలకు తగిన భవనాలను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల విభజన కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

13 జిల్లాలు.. 26 జిల్లాలుగా..

ఏప్రిల్ 2న కొత్త జిల్లాల నుంచే పాలన అందించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది నాడు ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు, కసరత్తులపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటన్నర పాటు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. మూడు నాలుగు రోజుల్లో అన్ని అభ్యంతరాలను పరిశీలించి మార్చి 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల మార్పు మొదలైన అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనునట్లు సమాచారం.

పెరగనున్న రెవెన్యూ డివిజన్లు

తుది నోటిఫికేషన్ తరువాత కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. తొలుత కొత్త జిల్లాలకు కలెక్టర్‌, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల పేర్ల మార్పులు వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే మార్చి 31న తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed