2024 Ap Elections: నరసరావుపేట టిక్కెట్​ గోపిరెడ్డికే

by srinivas |
2024 Ap Elections: నరసరావుపేట టిక్కెట్​ గోపిరెడ్డికే
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రజా సంక్షేమమే పరమావధిగా, నాలుగున్నర ఏళ్ల కాలంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తెచ్చిన సీఎం జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందామని వైసీపీ దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో సమస్యలను స్థానిక ఎమ్మెల్యే సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.


నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కవ మెజారిటీతో గెలిపించుకోవాలని విజయసాయి పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రతి కుటుంబం సంతోషమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్లు చెప్పారు.. పార్టీలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పార్టీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి కలిసి ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం జగన్ కృషి పట్టుదల వల్లనే వచ్చిందని ఆయన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్రం దశ దిశను మార్చిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి కూడా నరసరావుపేట టికెట్ తనకే ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి తనకు చెప్పారని తెలిపారు. పార్టీలో చిన్న సమస్యలు ఉండటం సహజమని, వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. అందరినీ కలుపుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed