ఏపీలో హీటెక్కిన రాజకీయం.. డోస్ పెంచిన Pawan Kalyan..

by Javid Pasha |   ( Updated:2023-07-11 14:27:15.0  )
ఏపీలో హీటెక్కిన రాజకీయం.. డోస్ పెంచిన Pawan Kalyan..
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందాలని ధీమాగా ఉన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అంటున్నారు. అంతేకాదు వచ్చే ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి విషయంలో జనసేనది బలమైన సంతకం ఉంటుందని కూడా చెప్పుకొచ్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సంస్థాగతంగా పార్టీ బలపడకపోయినా ఇదేం ధీమా అంటూ పలువురు చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర అవుతుండటంతో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రను ప్రారంభించడం దానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం తెలిసిందే. అయితే వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల డోస్ పెంచారు. మెుదటి విడతలో పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయడం అదికాస్తా కాపులు వర్సెస్ కాపులు, ముద్రగడ వర్సెస్ పవన్ కల్యాణ్ ఇలా అనేక మలుపులు తిరిగింది. రెండోదశలో కూడా పవన్ కల్యాణ్ డోసు మరింత పెంచారు. ఈసారి ఏకంగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారానే మహిళల అక్రమ రవాణా జరగుతుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. వలంటీర్లు, మంత్రులు,మాజీమంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతోపాటు ఇష్టం వచ్చినట్లు పవన్‌ను తిట్టిపోస్తున్నారు. ఇంత జరుగుతున్నా జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కనీసం పట్టించుకోవడం లేదు. తమను కాదుకాదా అనుకుంటున్నారో లేక వైసీపీతో పెట్టుకోవడం ఎందుకులే అనుకుంటున్నారో తెలియదు కానీ కనీసం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా కూడా నిలబడటం లేదు. మరోవైపు జనసేనతో పొత్తుకోసం ప్రయత్నిస్తున్న టీడీపీ సైతం కిమ్మనడం లేదు. గతంలో ఫలితం వల్లనో లేక మన వరకు వచ్చేసరికి చూసుకుందాంలే అనుకుంటున్నారో కానీ టీడీపీ శ్రేణులు అసలు పట్టించుకోవడం లేదు. ఇరు పార్టీల తీరుపై జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తమ నాయకుడిని టార్గెట్ చేసినా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. వీళ్లని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే ఇక గెలిచినట్లేనని పెదవి విరుస్తున్నారు.

హీటెక్కిన రాజకీయం

మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల డోసు పెంచారు. ఇప్పటి వరకు వైసీపీ విధానాలను, ఇతర నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన జనసేనాని ఈసారి ఏకంగా వలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. వలంటీర్ వ్యవస్థ ప్రజల డేటాను సంఘ విద్రోహ శక్తులకు అందిస్తుందటూ ఆరోపణలు చేశారు. ఆ డేటా ఆధారంగా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు సైతం అందుకు ప్రతిగా రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

తగ్గేదేలే అంటున్న పవన్

వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ ఏకంగా విమర్శల దాడి పెంచింది. మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌ను సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గడం లేదు. తాను తప్పుచేసిన కొందరి గురించే మాట్లాడుతున్నానంటూ చెప్పుకొస్తున్నారు.వలంటీర్లను ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడకుండా కేవలం ఐదు వేల రూపాయలతోనే సరిపెట్టేస్తున్నారని విమర్శించారు. వలంటీర్లు ఇంట్లోకి దూరుతారా అని నిలదీస్తున్నారు. వైసీపీ ఎంత విమర్శలు చేస్తున్నా తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్నారు పవన్ కల్యాణ్.

బీజేపీ మౌనం

పవన్ కల్యాణ్‌పై వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తున్నప్పటికీ మిత్రపక్షమైన బీజేపీ మాత్రం కనీసం స్పందించడం లేదు. కిమ్మనకుండా మౌనం వహిస్తోంది. బీజేపీ విషయంలో ప్రతీదానికి పవన్ కల్యాణ్ కలిసి వస్తారు. కానీ రాష్ట్రంలో ఇంత రాజకీయం నడుస్తున్నా పవన్ ‌కు మద్దతుగా బీజేపీ నిలబడకపోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రాంతీయ పార్టీలు అయితే వైసీపీకి బెదిరినా జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎందుకు స్పందించడం లేదని జనసేన శ్రేణులు నిలదీస్తున్నారు. అంటే వైసీపీతో తెగదెంపులు తెంచుకోకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ పవన్‌కు మద్దతు పలకడం లేదా అని నిలదీస్తున్నారు. గతంలో వలంటీర్ వ్యవస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శాసన మండలిలో చర్చకు పట్టుబట్టారు. వలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేశారని విమర్శలు చేశారు. అంతేకాదు రాజ్యాంగ బద్దంగా ఇది విరుద్ధమంటూ మండిపడ్డారు. అంటే ఈ వలంటీర్ వ్యవస్థపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న సోము వీర్రాజు సైతం కనీసం స్పందించకపోవడం చర్చనీయాశంగా మారింది.

చంద్రబాబు చోద్యం

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం గతంలో వలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. మూటలు మోయడం, ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారిని ఇబ్బందిపెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు దిగిరావడం జరిగింది.అనంతరం వలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నోరెత్తని పరిస్థితి. ఇటీవలే యువగళం పాదయాత్రలో వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తాము అనలేదని లోకేశ్ చెప్పుకొచ్చారు. వలంటీర్లతో పెట్టుకుంటే ఎక్కడ మైనస్ అవుతుందోనని భావించిన చంద్రబాబు ప్రస్తుతం ఇక సైలెంట్‌గా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లతో వైసీపీ బంధంపై కానీ, వాలంటీర్ల గురించి కానీ చంద్రబాబు మాట్లాడే పరిస్ధితి కనిపించడంలేదు.

పైగా తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల జీతాలు పెంచుతామని టీడీపీలోని కీలక నేతలు హామీలపై హామీలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబు మిత్రుడు పవన్ కల్యాణ్‌కు అండగా నిలబడటం అనేది అసాధ్యమని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వలంటీర్ల వ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు మైనస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే దాని ప్రభావం తమపైనా టీడీపీపైనా పడుతుందని చంద్రబాబు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అందువల్లే ఈ వ్యవహారంలో చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళల ఊసేలేదు

పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సామాన్యమైన ఆరోపణలు కాదు. మహిళల అక్రమ రవాణాపై లెక్కలు సైతం వినిపించారు. అయితే ఈ మహిళలు ఏమయ్యారు..? ఎక్కడెక్కడ అదృశ్యమయ్యారు అనేదానిపై ఎవరూ మాట్లాడటం లేదు. వాస్తవానికి మహిళలు అదృశ్యం అయ్యారన్నది వాస్తవం. అదృశ్యమైన మహిళల ఆచూకీ తెలుసుకోవాలని ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని కోరడం లేదు. ఆ అంశంపై చర్చకూడా జరపడం లేదు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. మహిళల మాన ప్రాణాలకంటే వ్యక్తిగత దూషణలు, రాజకీయమే ముఖ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ టార్గెట్ చేస్తున్నా పొత్తులో ఉన్న బీజేపీ స్పందించకపోవడం పొత్తు కోసంయత్నిస్తున్న టీడీపీ సైతం మౌనం వహించడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. వీళ్లతో కలిసి ఎన్నికలకు ఎలా వెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed